: కోహ్లీ మూడు ఫార్మాట్ లలోను రాణించడం స్పూర్తినిస్తుంది: న్యూజిలాండ్ కెప్టెన్

టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీపై కేన్ విలియమ్సన్ ప్రశంసలు కురిపించాడు. వర్తమాన క్రికెట్ లో విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్, జో రూట్ ను ప్రతిభావంతులైన ఆటగాళ్లుగా పేర్కొంటారు. భారత పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఢిల్లీలో మాట్లాడుతూ, తన సమకాలీన ఆటగాళ్లలో కోహ్లీ ఆటతీరు తనకు నచ్చుతుందని అన్నాడు. మూడు ఫార్మాట్లలోను బౌలర్లపై ఆధిపత్యం చెలాయించే తీరు ముచ్చటగొలుపుతుందని పేర్కొన్నాడు. అతని ఆటను ఎంతగానో ఆస్వాదిస్తానని, తనకు ఎంతో ఇష్టమని చెప్పాడు. అతని ఆటతీరు నుంచి ఎంతో నేర్చుకోవచ్చని కేన్ విలియమ్సన్ తెలిపాడు. ఇంగ్లండ్ బ్యాట్స్ మన్ జోరూట్, ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఆటతీరు కూడా బాగుంటుందని చెప్పాడు. అయితే తమ నలుగురిలో ఎవరి ప్రత్యేకత వారిదేనని, ఎవరి శైలి వారికుందని చెప్పాడు. మెక్ కల్లమ్ నుంచి కెప్టెన్సీ స్వీకరించడం బాగుందని చెప్పాడు. కెప్టెన్సీ తన ఆటతీరును ప్రభావితం చేయలేదని తెలిపాడు. తమ జట్టులో చక్కటి ఆటగాళ్లున్నారని, అందరం కలిసి ఆటను ఆస్వాదిస్తున్నామని విలియమ్సన్ వెల్లడించాడు. భారత్ ను భారత్ లో ఎదుర్కోవడం అతిపెద్ద సవాలని, ఆ సవాలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపాడు. గత పర్యటనలో టీమిండియా స్పిన్ ను ఎదుర్కోవడం తమకు చాలా కష్టంగా అనిపించిందని, ఈ సారి తమకు కూడా నాణ్యమైన ముగ్గురు స్పిన్నర్లున్నారని, తాము కూడా చక్కని ఫలితం సాధిస్తామని కేన్ విలియమ్సన్ ఆశాభావం వ్యక్తం చేశాడు.

More Telugu News