: అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ గా మోత్కుపల్లి నరసింహులు?

అరుణాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ గా టీటీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు బాద్యతలు చేపట్టనున్నారా? అంటే టీడీపీ శ్రేణులు అవుననే సమాధానమిస్తున్నాయి. ఎన్డీఏ భాగస్వామ్య పక్షమైన టీడీపీకి ఒక గవర్నర్‌ పదవి ఇస్తామని గతంలో ప్రధాని హామీ ఇచ్చారంటూ వార్తలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా మోత్కుపల్లి గవర్నర్ అయిపోనున్నారని వార్తలు గుప్పుమన్నాయి. ఇంతలో కేంద్ర మాజీ మంత్రి నజ్మాహెప్తుల్లాతో పాటు నలుగురిని గవర్నర్లుగా నియమించినా ఆయనకు మొండిచెయ్యిచూపించారు. అయితే, ఏపీ ప్యాకేజీపై చర్చలు జరుగుతున్నందున, ప్యాకేజీ ప్రకటన తరువాత మోత్కుపల్లికి గవర్నర్‌ పదవి ఇస్తామని ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబుకు చెప్పినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తమిళనాడు, అరుణాచల్‌ ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ గవర్నర్‌ స్థానాలు ఖాళీ అయ్యాయి. దీంతో త్వరలో గవర్నర్ పదవులు భర్తీ చేయనున్న తరుణంలో ఆయనను అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ గా నియమించనున్నారని ఊహాగానాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మోత్కుపల్లి బయోడేటాను ఇప్పటికే తెప్పించుకుని పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో ఈసారి మోత్కుపల్లికి గవర్నర్ పదవి పక్కా అని టీటీడీపీ నేతలు పేర్కొంటున్నారు.

More Telugu News