: దేశ రాజధానిలో విజృంభిస్తోన్న వ్యాధుల‌పై అడిగినందుకు మీడియాపై కస్సుమన్న ఢిల్లీ మంత్రి!

ఢిల్లీలో చికెన్ గున్యా, డెంగ్యూ జ్వరాలు విజృంభిస్తున్న అంశంపై ఈరోజు ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేజ్రీవాల్ షాకింగ్ ట్వీట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ అంశంపై మోదీనే అడ‌గండంటూ ఆయ‌న పేర్కొన్నారు. ఇదే అంశంపై ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ కూడా మీడియా మిత్రుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వ్యాధుల వ‌ల్ల ప్ర‌జ‌లు ప్రాణాలు కోల్పోతున్నార‌ని, దీనిపై ఎటువంటి చ‌ర్య‌లు తీసుకుంటార‌ని విలేక‌రులు అడిగినందుకు ఆయ‌న‌కు చిర్రెత్తుకొచ్చింది. అస‌లు చికన్ గున్యా వల్ల ఎవరూ చనిపోరని వ్యాఖ్యానించారు. అంతేకాదు, మీడియా మిత్రుల‌కు దమ్ముంటే చికెన్ గున్యా వ‌ల్లే వారు మరణించినట్లు వైద్యపరంగా రుజువు చేయాలని కూడా స‌వాలు విసిరారు. అసలు త‌మ రాష్ట్రంలో చికెన్ గున్యా అధికంగా ఏమీ వ్యాపించడం లేదని సత్యేంద్ర జైన్ అన్నారు. వ్యాధుల విజృంభ‌ణ అంటూ వ‌స్తోన్న వార్త‌ల‌న్నీ మీడియా సృష్టేనని ఆరోపించారు. ప్ర‌జ‌ల్లో మీడియానే భయం రేకెత్తిస్తోందని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఒక‌వైపు ఢిల్లీలో వ్యాధులు విజృంభిస్తోన్నా మ‌రోవైపు సత్యేంద్రజైన్ మాత్రం గోవాలో వ‌చ్చే ఏడాది అక్క‌డ నిర్వ‌హించ‌నున్న ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ పాల్గొనే ఏర్పాట్ల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నారు. మీడియా ఈ అంశంపై ఆయ‌న స్పంద‌న అడిగితే.. ఇద్దరు ఎంసీడీ మేయర్లు ఢిల్లీలో లేరని స‌మాధానం ఇచ్చారు. ఢిల్లీని క్లీన్‌గా ఉంచే బాధ్య‌త వాళ్ల‌దేన‌ని అని అన్నారు. మీడియా మిత్రులు వాళ్లు ఢిల్లీలో ఎందుకు లేరో అడగాలని ఉచిత స‌ల‌హా ఇచ్చారు. ఢిల్లీ స‌ర్కారు ఆధ్వ‌ర్యంలో కేవలం 40 శాతం ఆసుప‌త్రి పడకలే ఉన్నాయని ఆయ‌న అన్నారు. ఇప్ప‌టివ‌ర‌కు తాము రోగులకు ఉన్న‌వాటిలోనే సదుపాయాలు కల్పిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. ఎందుకిలా జ‌రుగుతోంద‌ని, ఎవ‌రి ఆధారంగా ఆ ప‌రిస్థితి ఉంద‌ని మీడియా అడగ్గా స‌ద‌రు మంత్రి 'మోదీ, ఎల్జీ' అని ఆయన సమాధానం ఇచ్చారు. కాగా, ఢిల్లీలో చికెన్ గున్యా, డెంగ్యూపై అక్కడి మున్సిపల్ విభాగం అధికారులు తాజాగా నివేదిక విడుదల చేశారు. అందులో ఇప్పటివరకు ఢిల్లీలో నమోదైన చికెన్ గున్యా కేసులు 1,057 అని పేర్కొనగా.. 1,158 డెంగీ కేసులు నమోదయినట్లు పేర్కొన్నారు. ఇప్పటికీ మొత్తం పదిమంది రోగులు మరణించారు.

More Telugu News