: ఒంటరి మహిళలకు రూముల్లేవ్.. ముంబయి నగరంలో మహిళల ఇంటి కష్టాలు!

ముంబ‌యి మ‌హాన‌గ‌రంలో ఒంట‌రి మ‌హిళ‌లు బ‌స చేయ‌డానికి రూములు దొర‌క‌డం లేదు. త‌మ చ‌దువును, ఉద్యోగాన్ని కొన‌సాగించ‌డానికి నగరానికి వ‌స్తోన్న మ‌హిళ‌ల‌కు అక్క‌డి ప్ర‌జ‌లు రూములివ్వ‌డానికి వెన‌కాడుతున్నారు. ఒకవేళ ఇవ్వ‌డానికి ముందుకొచ్చినా ఇళ్ల య‌జ‌మానులు పెట్టే ష‌ర‌తులు వింటే మ‌హిళ‌ల దిమ్మ‌తిరుగుతోంది. బ‌య‌ట‌కు వెళ్లిన మ‌హిళ‌లు తిరిగి చీక‌టి ప‌డేలోపే ఇళ్ల‌కు చేరుకోవాలి. వారి కోసం పురుషులెవ్వ‌రూ ఇంటికి రాకూడ‌దు. వీకెండ్ పార్టీలు అంటూ బ‌య‌టికి వెళ్ల‌కూడదు. ఇక ద‌మ్ము, మ‌ద్యం ముట్టకూడదు. అంతేకాదు, వారు ఇంట్లో మాంసాహారం కూడా వండుకోకూడ‌దు. మ‌హిళలు రూమ్‌లోంచి బ‌య‌ట‌కు వెళ్లినా, మ‌ళ్లీ వ‌చ్చినా సెక్యూరిటీ గార్డు దగ్గరున్న రిజిస్టర్‌లో సంతకం చేయాల్సిందే. మ‌హిళ‌లు పెళ్లయినా వార‌యితే వారి కోసం భర్త వస్తే వారి మ్యారేజ్‌ సర్టిఫికేట్‌ చూపించాలి. వాస్తవానికి ముంబ‌యిలో ఇళ్ల కొర‌త ఏమీ లేదు. ఎన్నో అపార్ట్‌మెంట్లు కూడా ఉన్నాయి. ఇళ్లు ఇప్పించే బ్రోక‌ర్లూ క‌నిపిస్తూనే ఉంటారు. అయినా ఒంటరి మహిళలకు మాత్రం ఇళ్లు దొర‌క‌డం క‌ష్టంగా మారింది. ముంబ‌యి న‌గ‌రంలో అద్దె ఇళ్లు సంపాదించాలంటే ఎన్నో క‌ష్టాలు ఎదుర్కొంటున్న‌ట్లు ఫిల్మ్‌ మేకర్‌ షికా మేకన్ తాజాగా మీడియాకు చెప్పారు. ఎన్నో క‌ష్టాలు ప‌డి ఇళ్లు సంపాదించిన‌ప్ప‌టికీ అర్ధ‌రాత్రి ఆడ‌వాళ్లు ఉంటే ఇంటికి వ‌చ్చి తలుపులు త‌ట్టేవారు అధికంగా ఉన్నార‌ని ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అంతేగాక‌, ఇళ్ల‌ను తనిఖీలు చేసేవాళ్లు, వారిపై కామెంట్లు చేసేవారు రెచ్చిపోతున్నార‌ని ఆమె చెప్పారు. పదేళ్ల క్రితం తాను ముంబయికి వచ్చిన సమయంలో తాను కూడా ఇటువంటి పరిస్థితినే ఎదుర్కున్నట్లు మేకన్ తెలిపారు. కొన్ని రోజుల క్రితం ముంబయికి వచ్చిన తన స్నేహితురాలు ఒకరు కూడా ఇటువంటి పరిస్థితే అనుభవించిందని ఆమె చెప్పారు. తాను ఈ అంశాలపైనే 'బ్యాచ్‌లర్‌ గర్ల్స్‌' అనే టైటిల్‌తో ఓ డాక్యుమెంటరీ తీసినట్లు పేర్కొన్నారు. త్వరలోనే ఈ డాక్యుమెంటరీ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

More Telugu News