: ఆర్టీసీలో మెరుపు సమ్మె ఫలితం.. ఒక్క రోజే రూ.కోటి నష్టం

రూపాయి కోసం జరిగిన గొడవలో హైదరాబాదు సిటీ బస్ కండక్టర్ బదిలీ వ్యవహారం టీఎస్ ఆర్టీసీలో మెరుపు సమ్మెకు కారణమైన సంగతి తెలిసిందే. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు వరకు బండ్లగూడ, మహేశ్వరం, మిథాని, ఇబ్రహీంపట్నం, దిల్‌సుఖ్‌నగర్ తదితర 8 డిపోల్లో బస్సులు నిలిచిపోయాయి. ఫలితంగా ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడగా, సంస్థకు కోటి రూపాయల నష్టం వాటిల్లింది. దీనంతటికీ కారణం ఒకే ఒక్క రూపాయేనంటే ఆశ్చర్యం కలగకమానదు. నెల రోజుల క్రితం బస్సులో ప్రయాణిస్తున్న మహిళకు, కండెక్టర్‌కు మధ్య రూపాయి విషయంలో వివాదం జరిగింది. దీంతో బాధిత ప్రయాణికురాలు ఆర్టీసీ ఎండీకి ఫిర్యాదు చేసింది. విచారణలో కండెక్టర్ తప్పిదం ఉందని తేలడంతో ఆర్టీసీ ఎండీ ఆమెపై శాఖాపరమైన చర్యలు చేపట్టారు. అందులో భాగంగా ఆమెను మరో డిపోకు బదిలీ చేశారు. కండక్టర్ బదిలీని నిరసిస్తూ ఆమెకు టీఎంయూ మద్దతు తెలిపింది. దీంతో సోమవారం యూనియన్ నాయకులు మెరుపు సమ్మెకు దిగారు. దీంతో ఆదివారం మొత్తంగా 170 బస్సులు నిలిచిపోగా సోమవారం రీజియన్ పరిధిలోని 8 డిపోల్లో 973 బస్సులు రోడ్డెక్కలేదు. ఫలితంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. కాగా స్వల్ప విషయానికే సంఘం నాయకులు మెరుపు సమ్మెకు దిగడం సరికాదని ఉప్పల్ డిపో మేనేజర్ సరస్వతి అన్నారు.

More Telugu News