: బ్రిటన్ లో మతాంతర వివాహాన్ని అడ్డుకున్న 55 మంది సిక్కుల అరెస్ట్

సెంట్రల్ ఇంగ్లాండ్ లోని లీమింగ్టన్ స్పా ప్రాంతంలో ఉన్న సిక్కు దేవాలయం గురుద్వారలో వివాహం చేసుకుంటున్న సిక్కు యువకుడు, ముస్లిం యువతిని అడ్డుకునేందుకు యత్నించిన 55 మందిని బ్రిటన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి కిర్పాన్ (సిక్కులు సంప్రదాయంగా ధరించే బాకులు)లను స్వాధీనం చేసుకున్నారు. ఈ గురుద్వారాలో కులాంతర, మతాంతర వివాహాలు పెరగడంతో, ఆందోళన వ్యక్తం చేసిన సిక్కు సంఘాలు దాదాపు 8 గంటల పాటు గురుద్వార బయట నిరసన ప్రదర్శనలు చేశాయని, స్థానికంగా ఉద్రిక్తత తలెత్తుతుందన్న ఉద్దేశంతోనే వీరిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీస్ అధికారి డేవిడ్ గార్డెనర్ వెల్లడించారు. కిర్పాన్ లతో పాటు, ఇతర ప్రమాదకర ఆయుధాలు సైతం వీరి నుంచి స్వాధీనం చేసుకున్నామని ఆయన అన్నారు. సిక్కు ప్రతినిధులు శాంతియుతంగానే నిరసనలు తెలిపారని, మతాంతర వివాహాలకు తాము వ్యతిరేకం కాదని, అయితే, అందుకు గురుద్వారాలను వాడుకోవడాన్నే వ్యతిరేకిస్తున్నామని యూకే సిక్ కౌన్సిల్ సెక్రటరీ గుర్మీల్ సింగ్ వ్యాఖ్యానించారు. యూకే లో దాదాపు 4.2 లక్షల మంది సిక్కులు ఉంటుండగా, వీరిలో అత్యధికులు లీమింగ్టన్ స్పా ప్రాంతంలోనే స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు.

More Telugu News