: క్యాంపస్ హైరింగ్ మొదలు... టెక్కీలకు, ఎంబీఏలకూ టాప్ కంపెనీల ఆఫర్లివే!

ప్రస్తుత విద్యా సంవత్సరంలో క్యాంపస్ హైరింగ్ సీజన్ మొదలైంది. టాప్ కంపెనీలు తమ తమ సంస్థల్లోకి కొత్త ఉద్యోగులను తీసుకునేందుకు కాలేజీల వెంట పడుతున్నాయి. టైర్-1 నగరాల్లోని ఇనిస్టిట్యూట్ లు, కాలేజీల్లో చదువుతున్న వారికి అధిక ప్యాకేజీలతో కూడిన ఆఫర్లు వస్తున్నాయని హెచ్ఆర్ కన్సల్టింగ్ సంస్థ విల్లిస్ టవర్స్ వాట్సన్ అంచనా వేస్తోంది. టైర్ -2 లోని విద్యా సంస్థలతో పోలిస్తే నాలుగు రెట్ల వరకూ టైర్-1 విద్యార్థులకు లభిస్తోందని సంస్థ తన నివేదికలో పేర్కొంది. ఇండియాలోని 70 ఉన్నత సంస్థలు, వివిధ సెక్టార్లలోని మానవ వనరుల విభాగాధిపతులతో మాట్లాడి, క్యాంపస్ హైరింగ్ ట్రెండ్స్ పై విల్లిస్ టవర్స్ వాట్సన్ సర్వే నిర్వహించింది. ఈ సర్వే వివరాల ప్రకారం, టైర్-1 కాలేజీల్లో చదువుతున్న ఎంబీఏ విద్యార్థులకు రూ. 18.62 లక్షల ప్యాకేజీతో ఉద్యోగ ఆఫర్ లభిస్తోంది. టైర్- 2 విద్యార్థులకు రూ. 8.5 లక్షలు, టైర్- 3 ఇనిస్టిట్యూట్ ల నుంచి ఎంబీఏ చదివిన వారికి రూ. 4.4 లక్షలు మాత్రమే ఆఫర్ వస్తోంది. ఇక టైర్- 1 విద్యాసంస్థల్లో బీటెక్ చదివుతున్న వారికి రూ. 13.6 లక్షల వేతనాన్ని ఆఫర్ చేస్తున్న టాప్ కంపెనీలు టైర్- 2 విద్యార్థులకు రూ. 7 లక్షలు, టైర్- 3 విద్యార్థులకు రూ. 4.47 లక్షల వేతనం ఇస్తామని చెబుతున్నాయి. ఎంటెక్ చేసిన వారికి టైర్- 1లో రూ. 18.62 లక్షలు, టైర్- 2 లో రూ. 8.5 లక్షలు, టైర్- 3 లో రూ. 4.4 లక్షల ఆఫర్ వారిని పలకరిస్తోంది. ఇతర గ్రాడ్యుయేట్లకు రూ. 2.17 నుంచి రూ. 4 లక్షల వేతనాల వరకూ ఆఫర్లు వస్తున్నాయి.

More Telugu News