: కత్తులతో బెదిరించి రైలు ప్రయాణికులను దోచుకున్న దొంగలు.. ఢిల్లీలో ఘటన

కత్తులతో బెదిరించి రైలు ప్రయాణికులను దోచుకున్న ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. షకుర్ బస్తీ రైల్వే స్టేషన్‌లో గోరఖ్‌ధామ్ ఎక్స్‌ప్రెస్‌లోకి ప్రవేశించిన దోపిడీ దొంగలు ప్రయాణికుల మెడపై కత్తిపెట్టి నగదు, బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. అనంతరం దోచుకున్న సొమ్ముతో పరారయ్యారు. దొంగలను నిలువరించేందుకు ప్రయత్నించిన ఇద్దరు ప్రయాణికులకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. షకుర్ బస్తీ, వాయవ్య ఢిల్లీ మధ్య ఉన్న రైలు మార్గం కొంచెం ప్రమాదరకరంగా ఉండడంతో ఇక్కడ రైళ్లు చాలా నెమ్మదిగా వెళ్తాయని, దీనిని అవకాశంగా తీసుకుంటున్న దొంగలు రైళ్లలోకి ప్రవేశిస్తున్నారని సీనియర్ రైల్వే అధికారి ఒకరు తెలిపారు. ఆదివారం రాత్రి 8:30 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్టు ఆయన తెలిపారు. ఐదారుగురు దుండగులు ప్రయాణికులను కత్తులతో బెదిరించి సొత్తు దోచుకెళ్లినట్టు పోలీసులు తెలిపారు. అయితే ఎంత మొత్తం అన్న దానిపై స్పష్టత లేదన్నారు. ఇద్దరు ప్రయాణికుల వద్ద ఉన్న రూ.40 వేలు, రూ.70 వేలతోపాటు బంగారు నగలను కూడా దోచుకున్నారని తెలిపారు. మొత్తంగా 12 మందిని దొంగలు దోచుకున్నారన్నారు. కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలిస్తున్నట్టు పేర్కొన్నారు.

More Telugu News