: మోదీపై మరోమారు విరుచుకుపడిన రాహుల్.. రైతులతో ఎప్పుడైనా సెల్ఫీ తీసుకున్నారా? అని ప్రశ్న

ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై మరోమారు విరుచుకుపడ్డారు. మోదీ ఏనాడైనా రైతులతో సెల్ఫీ తీసుకున్నారా? అని ప్రశ్నించారు. ‘‘ఆయన అమెరికా వెళ్తారు. ఫ్రెండ్ ఒబామాను కలుస్తారు. సెల్ఫీలు తీసుకుంటారు. అటునుంచి అటే చైనా, జపాన్ వెళ్తారు. ఆయనెప్పుడూ రైతులతో సెల్ఫీలు తీసుకోరు’’ అని ధ్వజమెత్తారు. ‘‘మోదీ సెల్ఫీలు తీసుకుంటారు. ఎంజాయ్ చేస్తారు. దీనికి మనం పుల్‌స్టాప్ పెట్టాలి’’ అని ఆయన పిలుపునిచ్చారు. యూపీలోని ఘజీపూర్ జిల్లా బాద్సార్‌లో నిర్వహించిన ‘ఖాట్’ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాహుల్ కిసాన్ యాత్ర ఆదివారంతో ఆరో రోజుకు చేరుకుంది. సభలో బీఎస్పీ చీఫ్ మాయావతి, యూపీ సీఎం అఖిలేష్‌పైనా విరుచుకుపడ్డారు. ‘‘ ‘ఏనుగు’ అంతా తినేసింది. సైకిల్ పంక్చర్ అయింది. మాతో చేయి కలపండి. ఏం చేస్తామో చూడండి’’ అని ప్రజలకు పిలుపునిచ్చారు. రైతుల కోసం ప్రధాని మోదీ ఏమీ చేయడం లేదని పేర్కొన్న రాహుల్.. మోదీ, ఆరెస్సెస్ కలిసి ప్రజలను కులమతాల పేరుతో విభజిస్తున్నారని ఆరోపించారు. బక్రీద్ సందర్భంగా రాహుల్ తన యాత్రకు రెండు రోజులు విరామం ప్రకటించారు.

More Telugu News