: ప్రతి 15 కుటుంబాలకూ ఓ చిల్లర దుకాణం... ఇండియాలో 1.6 కోట్లకు చేరిన రిటైల్ స్టోర్లు

ఇండియాలో రిటైల్ స్టోర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ప్రస్తుతం రిటైల్ స్టోర్ల సంఖ్య 1.6 కోట్లకు చేరగా, ప్రతి 15 కుటుంబాలను నమ్ముకుని ఓ స్టోర్ నడుస్తున్నట్లయింది. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన 6వ ఎకనామిక్ సెన్సస్ గణాంకాలు వెల్లడి కాగా, రెండో స్థానంలో కోటికి పైగా యూనిట్లతో మాన్యుఫాక్చరింగ్ సెక్టారు నిలిచింది. ఇదే సమయంలో రిటైల్ షాపుల్లో 2.7 కోట్ల మంది ఉపాధిని పొందుతుండగా, మాన్యుఫాక్చరింగ్ రంగంలో 3 కోట్ల మందికి పైగా ఉపాధిని పొందుతున్నారు. ఆ తరువాతి స్థానాల్లో రవాణా రంగంలోని కంపెనీలు, గిడ్డంగులు, హోటల్స్, చిరుతిండి దుకాణాలు, ఆరోగ్య రంగం అత్యధిక యూనిట్లను, ఉపాధిని కల్పిస్తున్నాయి. ఆపై విద్యా రంగంలో 20 లక్షల స్కూళ్లు, ఇనిస్టిట్యూట్ లు పనిచేస్తూ, ఆర్థిక రంగానికి ఊతం ఇస్తున్నాయని వెల్లడైంది. దేశవ్యాప్తంగా అన్ని విభాగాల్లో 5.8 కోట్ల సంస్థలు, వాటి యూనిట్లు పనిచేస్తుండగా, 13 కోట్ల మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తోంది. 2005లో ఎకనామిక్ సెన్సస్ నిర్వహించగా, అప్పటి నుంచి తాజా లెక్కలు తేల్చే నాటికి నిర్మాణ రంగం 27 శాతం వృద్ధిని సాధించింది. వ్యవసాయేతర రంగాన్ని పరిశీలిస్తే 1.8 కోట్ల సంస్థలు, వాటి అనుబంధ యూనిట్లు 3.2 కోట్ల మందికి ఉపాధిని అందిస్తున్నాయి. రిటైల్ వాణిజ్య విభాగంలో 25 శాతం యూనిట్లు ఒక కుటుంబ అధీనంలో నడుస్తుండగా, 17 శాతం వరకూ ఎలాంటి విధానం లేకుండా సాగుతున్నాయి.

More Telugu News