: రూపాయి లాభం లేకుండా ఇండియాకు విమానాలు ఇచ్చేందుకు సిద్ధమన్న జపాన్

భారత్ తో మరింత స్నేహపూర్వక బంధాన్ని ఏర్పరచుకోవాలన్న ఉద్దేశంతో ఏ విధమైన ఆర్థిక లాభాపేక్ష లేకుండా సెర్చ్ అండ్ రెస్క్యూ ఎయిర్ క్రాఫ్ట్ షిన్మవ్యా యూఎస్-2 విమానాలను విక్రయించాలని జపాన్ భావిస్తోంది. మొత్తం 1.6 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 10,700 కోట్లు) విలువైన డీల్ లో భాగంగా విమానాల ధరను మరింతగా తగ్గించాలని జపాన్ నిర్ణయించింది. అతి తక్కువ ఎత్తులో ఎగురుతూ, సోదాలు జరపగల ఈ తరహా 12 ఎయిర్ క్రాఫ్ట్ లను భారత్ కు విక్రయించేందుకు తాము లాభాన్ని వదులుకోనున్నట్టు జపాన్ రక్షణ మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ డీల్ కుదిరితే ఇరు దేశాల మధ్యా ఉన్న చైనాకు, జపాన్, భారత్ స్నేహంపై గట్టి సంకేతాలు పంపినట్లవుతుందని వారు తెలిపారు. ఈ విమానాల ధరపై ఇండియా కొన్ని అనుమానాలు వ్యక్తం చేసిందని, వాటిని నివృత్తి చేయడంతో పాటు ధరను సైతం తగ్గించనున్నామని జపాన్ అధికారి ఒకరు స్పష్టం చేశారు. ఈ సంవత్సరంలో ప్రధాని నరేంద్ర మోదీ టోక్యోలో పర్యటించనున్నారన్న విషయాన్ని గుర్తు చేసిన ఆయన, ఆ సమయంలో విమానాల విక్రయ డీల్ పూర్తవుతుందని భావిస్తున్నట్టు తెలిపారు. కాగా, 1967 నుంచి 2014 వరకూ ఆయుధాలు, విమానాల ఎగుమతులపై జపాన్ స్వీయ నిషేధం విధించుకున్న సంగతి తెలిసిందే. ఈ ఒప్పందం కుదిరితే, నిషేధాన్ని తొలగించుకున్న తరువాత, జపాన్ తో డీల్ కుదుర్చుకునే తొలి దేశంగానూ ఇండియా నిలుస్తుంది.

More Telugu News