: ఇద్దరు వ్యక్తులు.. మతాలు వేరు... ఒకరి భార్యకు మరొకరు కిడ్నీ దానం చేశారు: రాజస్థాన్‌లో విచిత్ర ఘటన!

వినడానికి కొంత వింతగా ఉన్న ఇది నిజం. కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న ఇద్దరు మహిళలకు వారి భర్తలు కిడ్నీలు దానం చేశారు. అయితే విచిత్రంగా ఒకరి భార్యకు మరొకరు కిడ్నీ దానం చేయాల్సి వచ్చింది. అంతకన్నా విచిత్రమైన విషయం ఏమిటంటే.. వారిద్దరు హిందూముస్లింలు కావడం. కిడ్నీలు ఇచ్చిపుచ్చుకున్న వారిలో ఒకరు బక్రీద్‌ను ఆనందంగా జరుపుకుంటానని చెబుతుండగా, మరొకరు తనకు దీపావళి ముందే వచ్చేసిందని సంతోషంగా చెబుతున్నారు. వినోద్ భార్య అనిత గత కొంతకాలంగా ‘గ్లోమెరులార్’ అనే జబ్బుతో బాధపడుతోంది. దీంతో ఆమె కిడ్నీ చెడిపోయింది. ఆమె బ్లడ్ గ్రూప్ -బి. వినోద్ బ్లడ్ గ్రూప్-ఎ. దీంతో అతడు కిడ్నీ ఇవ్వడానికి సిద్ధమైనా ఆమెకు సరిపోదు. అలాగే పెయిన్ కిల్లర్లు విపరీతంగా వాడడం వల్ల అహ్మద్ భార్య తస్లీమ్ జహాన్‌కు కిడ్నీ పాడైంది. ఆమె బ్లడ్ గ్రూప్-ఎ. అహ్మద్ బ్లడ్ గ్రూప్-బి. దీంతో అతడి కిడ్నీ ఆమెకు సరిపడదు. మానవ అవయవాల మార్పిడి చట్టం ప్రకారం దగ్గరి బంధువులు మాత్రమే కిడ్నీలు దానం చేసే అవకాశం ఉంది. అయితే అహ్మద్ కిడ్నీ వినోద్ భార్యకు, వినోద్ కిడ్నీ అహ్మద్ భార్యకు సరిపోతుండడంతో ఇద్దరూ పరస్పర అంగీకారానికి వచ్చి ప్రభుత్వ అనుమతి పొందారు. దీంతో సెప్టెంబరు 2న ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ చేసిన వైద్యులు విజయవంతంగా కిడ్నీ మార్పిడి చేశారు. 90 శాతం కేసుల్లో మహిళలే అవయవ దానానికి ముందుకు వస్తారని కానీ ఇక్కడ అందుకు విరుద్ధంగా జరిగిందని ప్రైవేటు ఆస్పత్రి చీఫ్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ అశుతోష్ సోనీ తెలిపారు. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ను నిర్వహించింది ఆయనే. కాగా కిడ్నీ మార్పిడి చేయించుకున్న మహిళలు పూర్తిగా కోలుకున్నారు. హిందూ-ముస్లిం భాయి భాయి అని తాము నిరూపించామని అహ్మద్, వినోద్ సంతోషంగా చెబుతున్నారు.

More Telugu News