: నా ట్విట్టర్ అకౌంట్ ను హ్యాక్ చేసి, 'మోదీ-అంబానీ జోక్'పై వ్యాఖ్యలు పెట్టారు: రతన్ టాటా

తన ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేసిన గుర్తు తెలియని వ్యక్తులు, మోదీ-అంబానీ జోక్ పై తానే కామెంట్లు చేసినట్టుగా పెట్టారని ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా ఆరోపించారు. "నా ఖాతాను హ్యాక్ చేయడం షాక్ కలిగించింది. ఆపై నేను చేయని వ్యాఖ్యను నాకు ఆపాదించారు. నెటిజన్లకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాను. ఆపై ఆ వ్యాఖ్యలను డిలిట్ చేసి, ఖాతాను పునరుద్ధరించాము" అని ఆయన అన్నారు. ట్విట్టర్ ఖాతాలో అంతగా యాక్టివ్ గా కనిపించని టాటా సన్స్ గౌరవ చైర్మన్ గా ఉన్న రతన్ టాటా నుంచి వచ్చిన వ్యాఖ్య సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. కాగా, ఓ పేరడీ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్‌ చేసిన ముఖేష్‌ అంబానీ, ప్రధాని మోదీ చిత్రాన్ని హ్యాకర్లు రతన్‌ టాటా ఖాతాలో రీట్వీట్‌ చేస్తూ, వీరిద్దరూ ద్రవ్యోల్బణాన్ని అరికడతారని అంటూ వ్యంగ్య వ్యాఖ్య ఉంచారు. గత సంవత్సరంలో ఫిబ్రవరి 21, సెప్టెంబర్ 1, డిసెంబర్ 28 తేదీల్లో మూడు ట్వీట్లు పెట్టిన రతన్ టాటా, ఆపై ఎన్నడూ మరో ట్వీట్ పెట్టలేదు. ఆయన్ను 61.3 లక్షల మంది ఫాలో అవుతుండగా, ఏప్రిల్ 2011లో ట్విట్టర్ లో ఖాతా ప్రారంభించిన ఆయన ఇప్పటివరకూ 119 ట్వీట్లు మాత్రమే చేశారు.

More Telugu News