: ప్రేక్షక దేవుళ్లు ఇంత గొప్ప విజయాన్ని అందించారు: జూనియర్ ఎన్టీఆర్

సెప్టెంబర్ 1న 'జనతా గ్యారేజ్' సినిమా విడుదలైతే, సెప్టెంబర్ 2న తన తల్లిదండ్రుల పుట్టిన రోజు అనీ, వారిద్దరికీ 60 ఏళ్లు నిండాయని, ఆ సందర్భంగా 12 ఏళ్ల తపన తెలియజేద్దామన్న తన ఆలోచనకు తగ్గ బహుమతిని ఈ సినిమా విజయం ఇచ్చిందని జూనియర్ ఎన్టీఆర్ తెలిపాడు. 'జనతా గ్యారేజ్' సక్సెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ, "తన పక్కన నటించే అర్హత నాకు లేకపోయినా, నన్ను ఓ తమ్ముడిలా, కొడుకులా, శిష్యుడిలా చేసుకుని, నాలోని బెరుకును పోగొట్టిన మోహన్ లాల్ గారికి శిరస్సువంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా"నని అన్నారు. ఈ సినిమాను తిరుగులేని విజయం దిశగా నడిపిన ప్రేక్షక దేవుళ్లకి ధన్యవాదాలని తెలిపాడు. ఇది ప్రేక్షక దేవుళ్లు, జనతా అందించిన గొప్ప విజయమని, దీనిని స్పూర్తిగా తీసుకుని మరిన్ని మంచి సినిమాలు చేస్తానని ఆయన అన్నాడు. సమంత, తాను కలిసి ఇప్పటికి నాలుగు సినిమాలు చేశామని, వాటిలో రెండు విజయం సాధిస్తే, మరో రెండు తాము ఊహించిన స్థాయిని అందుకోలేదని అన్నాడు. దీంతో సమంతతో కలిసి తాను సినిమా చేస్తే విజయం రాదంటూ పలువిమర్శలు వినిపించాయని ఆయన గుర్తు చేసుకున్నారు. చిట్టచివరికి తమ ఇద్దరికీ కొరటాల శివ అద్భుతమైన విజయం ఇచ్చారని ఆయన అన్నారు. 'జనతా గ్యారేజ్' మెకానిక్ లు కేవలం సినిమాలోనే కాకుండా, సినిమా షూటింగ్ లో కూడా తమకు బలం, బలగంగా నిలిచారని సాటి ఆర్టిస్టులకు, టెక్నీషియన్లకు ఆయన కృతజ్ఞతలు చెప్పారు. తన తాతగారితో కలసి పని చేసిన ఎడిటర్ చంటి మామ తనకు అందించిన ప్రోత్సాహం మరువలేనని ఆయన అన్నారు. 'జనతా గ్యారేజ్'లో రాజీవ్ కనకాల చేసిన జీహెచ్ఎంసీ ఎపిసోడ్ సినిమాకు వెన్నెముక లాంటిదని అంతా చెబుతుంటే, ఆ పాత్రను మా రాజీవ్ చేయడంతోనే అంతా అలా మాట్లాడుకుంటున్నారని గర్వంగా ఉందని జూనియర్ తెలిపాడు. తామిద్దరం కలిసి ఆ విజయాన్ని చవిచూడడం ఆనందాన్ని రెట్టింపు చేసిందని ఆయన తెలిపారు. ఇంత అద్భుతమైన సినిమాకి సరైన బ్యాక్ గ్రౌండ్ స్కోరు లేకపోతే, ఇంత ఘనవిజయం సాధ్యమై ఉండేది కాదని ఆయన తెలిపారు. అంత మంచి సంగీతం అందించిన దేవీశ్రీప్రసాద్ కు ధన్యవాదాలు అని ఆయన చెప్పారు. ఈ సినిమా నిర్మాతలు, టెక్నీషియన్లు అందరికీ పేరుపేరునా ధన్యవాదాలని జూనియర్ ఎన్టీఆర్ తెలిపారు.

More Telugu News