: మేము చేపడుతున్న బలమైన సైనిక చర్యలు అమెరికాకు కోపం తెప్పిస్తున్నాయి: ఉత్తర కొరియా

ఉత్త‌ర‌కొరియా త‌న దూకుడు చ‌ర్య‌ల‌ను కొన‌సాగిస్తూనే ఉంది. అగ్ర‌రాజ్యం అమెరికాతో పాటు ప‌లు దేశాల నుంచి వ‌స్తోన్న విమ‌ర్శ‌ల‌ను తిప్పికొడుతూ వ్యాఖ్య‌లు చేస్తోంది. తాజాగా ఆ దేశం మ‌రో శక్తిమంతమైన అణుపరీక్ష నిర్వహించిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ఆ దేశ అధికార పార్టీ మీడియా సంస్థ స్పందిస్తూ.. తమ దేశం చేస్తోన్న అణుప‌రీక్ష‌ల‌ను సమర్థించుకునే ప్ర‌య‌త్నం చేసింది. అమెరికా న్యూక్లియర్ ‘బ్లాక్మెయిల్’ కు లొంగి తాము వెనకడుగు వేయబోమని తేల్చిచెప్పింది. తాము చేపడుతున్న బలమైన సైనిక చర్యలు అగ్రరాజ్యానికి కోపం తెప్పిస్తున్నాయని చెప్పింది. అయినప్పటికీ అమెరికాను లెక్కచేసేది లేదని పేర్కొంది. పనిలో పనిగా ఆ దేశ అధికార పార్టీ మీడియా సంస్థ దక్షిణ కొరియా అధ్యక్షురాలు పార్క్ గిన్ హై పై కూడా ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. తమ దేశం చేసిన‌ బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాన్ని వ్యతిరేకించినందుకు ఆమెను విదేశీ సైన్యపు ‘డర్టీ ప్రాస్టిట్యూట్’ అంటూ అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్య‌లు చేసింది. ఆమె చేసిన వ్యాఖ్య‌లు నిరాధార‌మ‌ని ఉత్త‌ర‌కొరియా పేర్కొంది. ఇటువంటి అమెరికా తొత్తులు చేస్తోన్న విమ‌ర్శ‌ల ప‌ట్ల స్పందిస్తూ తాము త‌మ‌ విధానాన్ని మార్చకోబోమ‌ని స్ప‌ష్టం చేసింది. మ‌రోవైపు ఉత్తర కొరియాపై మరిన్ని ఆంక్షలు విధించేందుకు ఐక్యరాజ్య సమితి సిద్ధ‌మ‌వుతోంది.

More Telugu News