: పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన వెంకయ్య!

తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడ వేదికగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వని కేంద్రంపై విరుచుకుపడిన టాలీవుడ్ అగ్ర నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్.. బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడిపై వాగ్బాణాలు సంధించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై కాస్తంత ఆలస్యంగానే అయినా వెంకయ్యనాయుడు కూడా దీటుగానే స్పందించారు. ఢిల్లీలో ఏపీ బీజేపీ నేతలు ప్రధాని నరేంద్ర మోదీతో నేటి ఉదయం భేటీ అయ్యారు. ఈ భేటీకి వెంకయ్య కూడా హాజరయ్యారు. భేటీ ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన వెంకయ్య... పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను తిప్పికొట్టారు. ‘‘నేను రాజకీయాలకు భయపడను. ఎవరికైనా ఏదైనా మాట్లాడే వాక్ స్వాతంత్ర్యం ఉంది. అయితే ఇతరుల మనసులను నొప్పించే అధికారం ఏ ఒక్కరికీ లేదు. నా చిత్తశుద్ధిని ఎవరూ ప్రశ్నించలేరు. ప్రత్యేక హోదాపై ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలకు మాత్రమే మేం సమాధానమిస్తాం. ఏపీకి ప్రత్యేక హోదాకు మించిన సాయాన్ని కేంద్రం చేస్తోంది. రెండేళ్లలో పోలవరానికి రూ.800 కోట్లకు పైగా నిధులు విడుదల చేశాం. 7 మండలాలను ఏపీకి బదలాయించడంతోనే మా చిత్తశుద్ధి తేటతెల్లమైంది. నేను ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహించకపోయినా... ఏపీకి నేను ఏం చేస్తున్నానో ప్రతి ఒక్కరికీ తెలుసు’’ అని వెంకయ్య వ్యాఖ్యానించారు.

More Telugu News