: హిల్లరీ క్లింటన్ కు 'ఫేస్ బుక్' 134 కోట్ల రూపాయల భూరి విరాళం

ఫేస్ బుక్ సహ వ్యవస్థాపకుడు డస్టిన్ మొస్కొవిట్జ్ అమెరికా, డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి హిల్లరీ క్లింటన్ కు 134 కోట్ల రూపాయల విరాళమివ్వనున్నానని ప్రకటన చేశారు. ఈ మేరకు తన భార్య కరితో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నానని ఆయన తన బ్లాగులో రాసిన ప్రకటనలో పేర్కొన్నారు. అమెరికాలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో తాము ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన వెల్లడించారు. తాను, తన భార్య ఓ పార్టీ అభ్యర్థికి బాసటగా నిలవడం ఇదే తొలిసారని ఆయన తెలిపారు. ఒక స్వతంత్ర వ్యక్తిగా, ఒక దేశంగా, ఒక సమాజంగా ఎలా ఉండాలని మనం నిర్ణయించుకోనున్నామన్నది నవంబర్ లో జరగనున్న ఎన్నికల తరువాత తెలుస్తుందని ఆయన అందులో పేర్కొన్నారు. రిపబ్లికన్ పార్టీ, ఆ పార్టీ అధ్యక్ష అభ్యర్ధి డోనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచారంలో గుడ్డిగా ప్రవర్తిస్తున్నారని, వీరు ఇమిగ్రేషన్ పై చేస్తున్న వ్యాఖ్యలు, భవిష్యత్ లో ఇతర దేశాల పౌరులతో పాటు అమెరికన్లను కూడా బాధిస్తాయని ఆయన స్పష్టం చేశారు. తాను చేస్తున్న ఈ సాయం డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి హిల్లరీ క్లింటన్ కు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నానని ఆయన తన బ్లాగులో తెలిపారు.

More Telugu News