: వివాదాల్లో హర్భజన్ కి వారసుడిగా తయారవుతున్న అశ్విన్

క్రికెట్ లో స్లెడ్జింగ్ ఒక భాగమని ఆటగాళ్లు అంగీకరిస్తారు. అలాంటి సమయంలో భావోద్వేగాలు నియంత్రించుకోవడం ముఖ్యమని కూడా చెబుతుంటారు. ఆ పరిణతి వస్తే ఆటగాడు బాగా రాణిస్తాడని సీనియర్లు చెబుతుంటారు. అలాంటి పరిణతి సాధించకపోవడంతోనే ఐపీఎల్ సందర్భంగా టీమిండియా బౌలర్ హర్భజన్ సింగ్ తన సహ ఆటగాడు శ్రీశాంత్ ను చెంపదెబ్బ కొట్టిన సంగతి, అది పెనువివాదంగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పుడు భజ్జీకి వారసుడిగా టీమిండియాలో అందరి ఆదరాభిమానాలు అందుకుంటున్న రవిచంద్రన్ అశ్విన్ అలాంటి వివాదాల్లోనే ఇరుక్కుంటుండడం క్రికెట్ అభిమానుల్లో అసహనం కలిగిస్తోంది. టీమిండియా ఆటగాడైన అశ్విన్ తమిళనాడు ప్రీమియర్ లీగ్‌ లో దిండిగల్ డ్రాగన్స్ కు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా చెపాక్ సూపర్ గిల్లీస్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో బ్యాటింగ్ లో భాగంగా అశ్విన్ నాన్ స్ట్రైక్ ఎండ్ లో ఉండగా, చెపాక్ బౌలర్ సాయి కిషోర్ బ్యాటింగ్ చేస్తున్న జగదీష్ ను క్యాచ్ ఔట్ చేశాడు. దీంతో జగదీష్‌ పెవిలియన్ కు వెళ్తుండగా, సాయి కిశోర్ అత్యుత్సాహంతో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. దీంతో జగదీష్ ఆగ్రహంగా అతనిపైకి దాడి చేసేందుకు వచ్చాడు. వారిద్దరి మధ్య వివాదాన్ని చల్లబర్చాల్సిన అశ్విన్, దానికి మరింత ఆజ్యం పోసినట్టు అతనితోపాటు తనూ సై అన్నాడు. తన చేతిలోని బ్యాటుతో కిశోర్ ను తోయబోయాడు. ఇంతలో కీపర్, అంపైర్లు, ఇతర ఆటగాళ్లు సర్ది చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. ఈ మ్యాచ్ లో అశ్విన్ జట్టు ఓటమిపాలవడం కొసమెరుపు. ఇదిలా ఉంచితే, గత వారం కూడా అశ్విన్ ఒక ఆటగాడిపై చేయిచేసుకోబోవడంతో అతని వ్యవహార శైలి హాట్ టాపిక్ గా మారింది. వారి వాగ్వాదం చూసిన అభిమానులు అశ్విన్ మరో హర్భజన్ లా తయారయ్యేట్టున్నాడని విమర్శలు సంధించారు.

More Telugu News