: ఎలక్ట్రిక్‌ బాత్‌... ఒళ్లు నొప్పుల నుంచి ఉపశమనానికి కొత్త పధ్ధతి!

ఒళ్లు నొప్పులు త‌గ్గ‌డానికి వైద్యులు ఎన్నో మార్గాలను సూచిస్తారు. వ్యాయామం, మందులు, స‌హ‌జ‌సిద్ధ వైద్యం అంటూ ఒంటి నొప్పుల‌తో బాధ‌ప‌డుతోన్న వారు ఎన్నో ర‌కాల ప్ర‌యత్నాలు చేస్తుంటారు. ఎంతో క‌ష్ట‌ప‌డి పోతుంటారు. ఒక్కోసారి ఈ ప్ర‌యత్నాల‌న్నీ ఒళ్లు నొప్పులు త‌గ్గించుకోవ‌డానికా..? పెంచుకోవ‌డానికా? అంటూ డౌట్లు కూడా వ‌స్తుంటాయి. నొప్పులు త‌గ్గించుకోవ‌డానికి ఇన్ని క‌ష్టాలు ప‌డ‌డం క‌న్నా నొప్పుల్ని భ‌రించ‌డ‌మే న‌య‌మ‌ని వాపోతుంటారు. అయితే సన్‌బాత్‌, స్టీమ్‌బాత్ లా ఎలక్ట్రిక్‌ బాత్ చేస్తూ క‌ష్ట‌ప‌డ‌కుండా నొప్పులు త‌గ్గించుకోమ‌ని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు. జపాన్‌లో ఈ ఎలక్ట్రిక్‌ బాత్ ల‌ను అధికంగానే ఉప‌యోగించేస్తున్నారు. అందులో స్నానం చేసి ఒళ్లు నొప్పుల నుంచి ఉప‌శ‌మ‌నం పొందుతున్నారు. స్నానం చేసే టబ్‌లోకి తక్కువ స్థాయిలో విద్యుత్‌ ప్రసరించేలా చేసి త‌క్కువ స్థాయిలో విద్యుత్‌షాక్‌ శరీరానికి త‌గిలేలా చేస్తారు. దీంతో ఒళ్లు నొప్పుల‌తో బాధ‌ప‌డుతోన్న‌ కండరాల్లో కరెంట్‌ ప్రసరించి ఒంటి నొప్పి త‌గ్గుతుంది. ఎలక్ట్రిక్ బాత్‌తో కీళ్లనొప్పి, స్పాండిలైటిస్ ను సైతం త‌గ్గేలా చేయొచ్చ‌ట‌. వైద్య పరిభాషలో ఈ ప‌ద్ధ‌తిని ఎలక్ట్రోథెరపీ అంటారు. ప్ర‌పంచంలోనే తొలిసారిగా ఈ విధంగా ఒంటినొప్పులు తగ్గించుకోవ‌డాన్ని 1767లో లండన్‌లోని ఓ ఆసుపత్రిలో చేశారు. 1940లోనూ అమెరికాలో ఈ ప‌ద్ధ‌తి ఉప‌యోగించారు. ఆ దేశంలో శ‌త్రువుల‌తో పోరాడుతూ గాయపడ్డ సైనికులకు చికిత్స అందించేందుకు ఈ ప‌ద్ధ‌తితో కండరాల్లో బలాన్ని పెంచేందుకు ఉపయోగించారు. ఒంటి నొప్పుల‌కే కాదు, క్యాన్సర్‌ను నయం చేయ‌డానికి సైతం ఈ ప‌ద్ధ‌తి ద్వారా చికిత్స చేసినట్లు 1985లో క్యాన్సర్‌ జర్నల్‌ రీసెర్చ్ లో పేర్కొన్నారు. ఈ ప‌ద్ధ‌తి ఉప‌యోగించిన‌ప్పుడు విద్యుత్‌ నుంచి వచ్చే ఎలక్ట్రోడ్‌లు గాయపడ్డ ప్రాంతంలో నరాలను ఉత్తేజపరుస్తాయ‌ట‌. దీంతో ఆ సిగ్నల్స్ మెదడుకు వెళ్లి గాయపడ్డ ప్రాంతంలో నొప్పి తగ్గిపోయేలా చేస్తాయట. ఈ ప‌ద్ధ‌తిలో ఉత్ప‌న్న‌మ‌య్యే ఈ ఎలక్ట్రోడ్‌ల వల్ల శరీరంలో సహజ సిద్ధమైన పెయిన్‌కిల్లర్స్‌ ఎండోర్ఫిన్స్‌ను విడుదల చేసి నొప్పిని నివారిస్తాయని కూడా ప‌రిశోధ‌కులు మ‌రో వాద‌న వినిపిస్తున్నారు. ఇన్ని ప్ర‌యోజ‌నాలు ఉన్న ఈ ఎలక్ట్రిక్‌ బాత్ ను జ‌పాన్‌లో అధికంగానే ఉప‌యోగించేస్తున్నారు.

More Telugu News