: కర్ణాటకలో తీవ్ర ఉద్రిక్తత... కావేరీ డ్యామ్ వద్ద కాల్పులు, నిరసనల్లో సినీ తారలు

తమిళనాడుకు కావేరీ నీటిని విడుదల చేయడంపై కర్ణాటకలో మొదలైన నిరసనలు నేడు తీవ్ర రూపం దాల్చాయి. కేఎస్ఆర్ డ్యామ్ వద్ద నిరసనకారులను అదుపు చేసేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరపాల్సి వచ్చింది. కావేరీ నదిలో నీరు లేని పరిస్థితుల్లో కిందకు వదలడం ఏంటని ప్రశ్నిస్తూ, వందలాది మంది రైతులు, ప్రజలు తీవ్ర నిరసనలకు దిగడంతో వారిని అదుపు చేసేందుకు వాటర్ క్యానన్ లను ప్రయోగించాల్సి వచ్చింది. రాష్ట్రవ్యాప్త బంద్ తో బెంగళూరు సహా అన్ని ప్రాంతాల్లో రహదారి రవాణా వ్యవస్థ నిలిచిపోయింది. బెంగళూరులోని అన్ని ఐటీ కంపెనీలు, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలూ మూతపడ్డాయి. కన్నడనాట తమిళ చానల్స్ ప్రసారాలను కేబుల్ ఆపరేటర్లు నిలిపివేశారు. బెంగళూరులో సినీతారలు పునీత్ రాజకుమార్, రాగిణి తదితరులు నిరసనల్లో పాల్గొన్నారు. మెట్రో రైల్ సేవలు నిలిచాయి. మరోపక్క, తమిళనాడు రిజిస్ట్రేషన్ నంబర్ తో ఏ విధమైన వాహనాల్లో ప్రజలు కర్ణాటకలోకి వెళ్లవద్దని తమిళనాడు ప్రభుత్వం సూచించింది. ఇరు రాష్ట్రాల మధ్యా పలు ప్రాంతాల్లో ఉన్న సరిహద్దులన్నీ మూసివేసినట్టు తెలుస్తోంది.

More Telugu News