: సర్కారు స్కూళ్ల స్థలాలపై కన్నేసిన తెలంగాణ ప్రభుత్వం.. ‘మెట్రో’ పార్కింగ్ కోసమేనట!

తెలంగాణ ప్రభుత్వం దృష్టి ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల స్థలాలపై పడింది. వాటిని స్వాధీనం చేసుకుని మెట్రోకు అప్పగించాలని యోచిస్తోంది. ఆ స్థలాల్లో పార్కింగ్ సదుపాయాలు కల్పించడంతోపాటు మోడల్ మార్కెట్లను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఇటీవల కూకట్‌పల్లి ప్రభుత్వ పాఠశాల స్థలాన్ని స్వాధీనం చేసుకున్న ప్రభుత్వం కూకట్‌పల్లి మెట్రో స్టేషన్‌ కోసం దానిని హైదరాబాద్ మెట్రో రైలుకు అప్పగించింది. ఇప్పుడు ముషీరాబాద్, హిమాయత్‌నగర్, కాచిగూడ, బేగంపేట, నాంపల్లిలోని సర్కారీ స్కూళ్ల స్థలాలపై ప్రభుత్వం దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ప్రభుత్వ నిర్ణయంపై ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలలను మరింత పటిష్టం చేయాల్సిన సర్కారు వాటిని మరింత బలహీన పరుస్తోందని సంఘాలు విరుచుకుపడుతున్నాయి. హైదరాబాద్‌ మెట్రో రైలు కోసం మొత్తంగా మూడు కారిడార్లలో 65 స్టేషన్లు నిర్మించతలపెట్టగా ఇప్పటి వరకు 17 స్టేషన్లకు మాత్రమే పార్కింగ్ స్థలాలు లభించాయి. ఈ స్టేషన్లన్నీ ముఖ్యమైన ప్రాంతాల్లో ఉండడంతో మిగతా 48 స్టేషన్లకు పార్కింగ్ స్థలాలు దొరకడం మెట్రోకు కష్టంగా మారింది. ప్రైవేటు స్థలాలను ఇందుకోసం తీసుకోవడం ఆర్థికంగా పెనుభారం కావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆయా ప్రాంతాల్లో ప్రైవేటు స్థలం చదరపు గజం రూ.30 వేల నుంచి రూ.లక్ష వరకు పలుకుతోంది. దీంతో సర్కారీ స్కూళ్ల స్థలాల విషయంపై మెట్రో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా సర్కారు దానికి ఓకే చెప్పింది.

More Telugu News