: సీఎం చంద్రబాబుకు, ఏపీ ఎమ్మెల్యేలకు నా ధన్యవాదాలు: వెంకయ్యనాయుడు

వస్తు సేవల పన్ను(జీఎస్ టీ) బిల్లును ఆమోదించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి, అసెంబ్లీలోని అన్ని పార్టీల శాసనసభ్యులకు ఈ సందర్భంగా తన ధన్యవాదాలు తెలియజేస్తున్నానని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఈరోజు సాయంత్రం మీడియా సమావేశంలో వెంకయ్యనాయుడు మాట్లాడుతున్న సందర్భంలో ఈ ప్రకటన చేశారు. జీఎస్ టీ ఒక విప్లవాత్మకమైన సంస్కరణ అని, ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఇప్పటికే సగం రాష్ట్రాలకు పైగా ఈ బిల్లును ఆమోదించాయని, రాబోయే రోజుల్లో దేశం ఆర్థికంగా మరింత బలపడుతుందని అన్నారు. అయితే, ఈ బిల్లు వల్ల దేశం ఆర్థికంగా బలహీనపడుతుందని కొందరు అంటున్నారని, ‘చూద్దాం.. బలపడుతుందో, బలహీనపడుతుందో తెలుస్తుంది. ఎందుకంటే, ఇండియా బలపడుతుందని వరల్డ్ బ్యాంక్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, వరల్డ్ ఎకనమిక్ ఫోరం, ఏడీబీ అన్నీ చెబుతున్నాయి. కానీ, బలహీనపడుతుందంటూ కొంతమంది శాపనార్థాలు పెడుతున్నారు’ అని వెంకయ్యనాయుడు అన్నారు. ఇదే సమయంలో జీఎస్ టీ బిల్లును రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదించిన సమాచారం వెంకయ్యనాయుడికి తెలిసింది. ‘ఇప్పుడే వార్త వచ్చింది. జీఎస్ టి బిల్లును రాష్ట్రపతి గారు ఆమోదముద్ర వేస్తూ సంతకం పెట్టారు. చాలా సంతోషం. దేశానికి చాలా శుభ దినం ఇవాళ’ అని వెంకయ్యనాయుడు అన్నారు.

More Telugu News