: ఏపీకి ప్ర‌త్యేక హోదాపై శాస‌న‌మండ‌లిలో ముఖ్యమంత్రి చంద్ర‌బాబు ప్ర‌క‌ట‌న

ఆంధ్ర‌ప్ర‌దేశ్ శాస‌న‌స‌భ‌లో వైఎస్సార్ సీపీ నేత‌లు గంద‌ర‌గోళం సృష్టించ‌డంతో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఏపీకి ప్ర‌త్యేక హోదాపై ప్ర‌క‌ట‌న చేయ‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డి స‌భ రేపటికి వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే. అయితే చంద్ర‌బాబు నాయుడు ప్ర‌త్యేక హోదాపై ప్రస్తుతం శాస‌న‌మండ‌లిలో హోదాపై ప్ర‌క‌ట‌న చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ... అప్ప‌టి ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ ఇచ్చిన ప్ర‌తి హామీని అమ‌లు చేయాల‌ని తాము కేంద్రాన్ని కోరిన‌ట్లు పేర్కొన్నారు. విభ‌జ‌న చ‌ట్టం హామీలు, నిబంధ‌న‌లు, ఆనాడు పార్ల‌మెంటులో ప్ర‌ధాని చేసిన ప్ర‌క‌ట‌న‌ను ఎప్పటిక‌ప్పుడు స‌మీక్ష చేసుకుంటున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు. ప్ర‌క‌ట‌న‌లో జైట్లీ నాలుగు విష‌యాలు చెప్పారని గుర్తు చేశారు. పోల‌వ‌రం ప్రాజెక్టు ప్ర‌కట‌న ఎంతో లాభాన్ని చేకూరుస్తుంద‌ని అన్నారు. రాష్ట్రానికి న్యాయం చేయాల‌ని ఢిల్లీ వెళ్లి స్ప‌ష్టంగా కోరిన‌ట్లు చెప్పారు. విభ‌జ‌న చ‌ట్టంలోని హామీల‌ను జైట్లీ అమ‌లు ప‌రుస్తామ‌ని చెప్పిన‌ట్లు ఆయ‌న అన్నారు. శాస‌న‌స‌భ‌లో వైసీపీ నేత‌ల కార‌ణంగా ప్ర‌త్యేక హోదాపై స్టేట్‌మెంట్ ఇచ్చే అవ‌కాశం రాలేదని చంద్రబాబు పేర్కొన్నారు. అన్ని విష‌యాల్లోనూ ఏపీ ఇబ్బందుల్లో ఉంద‌ని ఆయ‌న అన్నారు. ఆదాయం స‌హా అన్ని అంశాల్లోనూ వెన‌క‌బ‌డి ఉన్నామ‌ని ఆయ‌న అన్నారు. తాము చేపట్టిన పట్టిసీమను ప్రతిపక్షాలు వ్యతిరేకించాయని అన్ని అడ్డంకులను ఎదుర్కొని పూర్తి చేశామని, ప్రజా ప్రయోజనాల అంశంలో వెనకడుగు వేయబోమని ఆయన అన్నారు.

More Telugu News