: అట్టుడుకుతున్న ఆంధ్రప్రదేశ్... తిరుపతి నుంచి విశాఖ వరకూ నిరసనలు!

దాదాపు వారం రోజుల పాటు చర్చోపచర్చలు, సంప్రదింపుల అనంతరం గత రాత్రి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చేసిన ప్రకటన ఊరించి ఉసూరుమనిపించినట్టుండగా, ఆంధ్రప్రదేశ్ భగ్గుమంది. ఆయన మీడియా సమావేశాన్ని, అందులో చెప్పిన అంశాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ప్రత్యేక హోదా సాధన సమాఖ్య, వైకాపా, కాంగ్రెస్, వామపక్ష పార్టీలతో పాటు కొన్ని చోట్ల తెలుగుదేశం నేతలు సైతం రహదార్లపై ధర్నాలకు దిగారు. దీంతో చిత్తూరు, తిరుపతి నుంచి విశాఖపట్నం, శ్రీకాకుళం వరకూ ఆంధ్రప్రదేశ్ యావత్తూ అట్టుడుకుతోంది. తిరుపతిలో ఈ ఉదయం వామపక్షాల ఆధ్వర్యంలో టెలిఫోన్ భవన్, పోస్టాఫీసుల ముట్టడి జరిగింది. ఉద్యోగులు కార్యాలయాల్లోకి వెళ్లకుండా తలుపులకు తాళాలు వేసిన నిరసనకారులు గేట్ల ముందు బైఠాయించి నిరసనలు తెలిపారు. పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. తిరుపతి, రేణిగుంట రహదారిపై వైకాపా కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. చిత్తూరు నుంచి బెంగళూరు వెళ్లే రహదారిని అక్కడి కార్యకర్తలు దిగ్బంధించారు. నెల్లూరు, ఒంగోలు ప్రాంతాల్లోనూ వైకాపా, సీపీఐ, సీపీఎం కార్యకర్తలు నిరసనలకు దిగగా, రాయలసీమలో ప్రత్యేక హోదా సాధన సమాఖ్య కార్యకర్తలు ధర్నాలు నిర్వహించి ర్యాలీలు జరిపారు. అనంతపురం, కడప, రాయదుర్గం తదితర ప్రాంతాల్లో నిరసనలు తెలిపారు. గుంటూరు జిల్లాతో పాటు ఉత్తరాంధ్రలోనూ నిరసనల జ్వాల చెలరేగింది. గుంటూరులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హిందూ కాలేజ్ సెంటర్ లో నిరసన కార్యక్రమం జరిగింది. అనకాపల్లిలో స్వయంగా టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ రంగంలోకి దిగారు. విశాఖలో వైకాపా ఆధ్వర్యంలో ప్రత్యేక హోదా కోరుతూ ర్యాలీ జరిగింది. కాగా, హోదాను డిమాండ చేస్తూ, ఎల్లుండి రాష్ట్ర బంద్, రహదారుల దిగ్బంధానికి వైకాపా, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ పార్టీలు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

More Telugu News