: లక్షన్నర కోట్లు ఖర్చుచేశాం... చూస్తూ ఊరుకుంటామా?: ఎయిర్ టెల్, ఐడియాలపై విరుచుకుపడ్డ ముఖేష్ అంబానీ

రిలయన్స్ జియో నుంచి ఎయిర్ టెల్, ఐడియా, వోడాఫోన్ తదితర టెలికం కంపెనీల వినియోగదారులకు కాల్స్ వెళ్లడం లేదని వస్తున్న ఫిర్యాదులపై రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ స్పందించారు. గడచిన వారం రోజుల వ్యవధిలో దాదాపు 5 కోట్లకు జియో నుంచి ఇతర నెట్ వర్క్ లకు వెళ్లిన కాల్స్ కనెక్ట్ కాకపోగా, జియో సిమ్ లను తీసుకున్న వారు అసంతృప్తికి గురవుతున్న వేళ ముఖేష్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఇంటర్ కనెక్ట్ కెపాసిటీ తమకు లేదని టెలికం సంస్థలు చెబుతుండటాన్ని ప్రస్తావిస్తూ, అది తాత్కాలికమేనని, సమస్యలన్నీ కొన్ని వారాల్లో పరిష్కారమవుతాయని, దీర్ఘకాలంలో ఇదే కొనసాగితే మాత్రం అది చట్ట వ్యతిరేకమేనని అన్నారు. "మార్కెట్లో నువ్వు ప్రముఖ స్థానంలో ఉన్నావు. (పేరును చెప్పకుండా ఎయిర్ టెల్ ను ఉద్దేశించి) ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నావు. ఒకటి లేదా రెండు సార్లు తప్పించుకోగలుగుతావేమో... మా ఉద్దేశంలో ఇంటర్ కనెక్ట్ వ్యవహారం ఓ చిన్న సమస్య. కొన్ని వారాల్లో పరిష్కృతమవుతుంది. అంతకుమించి చట్టాన్ని నువ్వు అతిక్రమించలేవు. ట్రాఫిక్ తో సంబంధం లేకుండా ఇంటర్ కనెక్ట్ కు మద్దతివ్వాల్సిందే. అదే లైసెన్స్ నిబంధనల్లో ఉంది" అని అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద స్టార్టప్ సంస్థగా రిలయన్స్ జియో ప్రారంభమైందని, ఒక్క రూపాయి కూడా ఆదాయాన్ని కోరుకోకుండా తాము రూ. 1.5 లక్షల కోట్లను పెట్టుబడిగా పెట్టామని, చట్ట వ్యతిరేకంగా, టెలికం లైైసెన్స్ నిబంధనలకు వ్యతిరేకంగా టెల్కోలు ప్రవర్తిస్తుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఇప్పటికిప్పుడు జియో నుంచి రాబడులు రావాలని తాము కోరుకోవడం లేదని, కానీ దీర్ఘకాలంలో మంచి ఆదాయం, లాభాలు వస్తాయని మాత్రం నమ్ముతున్నామని ముఖేష్ అంబానీ వ్యాఖ్యానించారు. ఇటీవలి కాలంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ మార్కెట్లో నష్టపోతుండటాన్ని ప్రస్తావిస్తూ, "ప్రపంచంలోని కొన్ని కంపెనీలు సాలీనా 20 శాతం లాభాలను వాటాదారులకు అందిస్తున్నాయి. నిజమే. ఆర్ఐఎల్ ఈ ఘనతను 39 వరుస సంవత్సరాల్లో నమోదు చేసింది. భారత చరిత్రలో అతిపెద్ద మూలధన వృత్తం కొనసాగిన సంస్థ ఇది. ఒకేసారి రెండు పెద్ద మొత్తాలను పెట్టుబడిగా పెట్టాము (జియో, రిఫైనరీ మరియు పెట్రోకెమికల్స్). అది కొంత ఇబ్బందికరమైంది. మరో పదేళ్లలో అద్భుతమైన రాబడులు వస్తాయి. వచ్చే ఏడాదికి ఆర్ఐఎల్ ఐపీఓ వచ్చి 40 సంవత్సరాలు అవుతుంది" అని అన్నారు. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ తో మౌలిక వసతుల షేరింగ్ డీల్ పై స్పందిస్తూ, గత విభేదాలను పక్కనబెట్టి తామిద్దరం చేతులు కలపడం తనకు వ్యక్తిగతంగా ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని, కుటుంబ పరంగానూ ఇది మంచి పరిణామమని అన్నారు. వ్యాపారానికి చెందినంతవరకూ తామిద్దరమూ వేరువేరని, ఇదే సమయంలో తామిద్దరి మూలాలూ ఒకటేనని అన్నారు.

More Telugu News