: ఢిల్లీ రైల్వే స్టేషన్ లో కేజ్రీవాల్ కు చుక్కెదురు... పోలీసుల ప్రమేయం ఉందన్న ఢిల్లీ సీఎం

మూడు రోజుల పంజాబ్ పర్యటన నిమిత్తం రైలులో లూథియానా వెళ్లేందుకు ఢిల్లీ రైల్వే స్టేషన్ కు చేరుకున్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు చుక్కెదురైంది. స్టేషన్లోకి దూసుకొచ్చిన వందల మంది మహిళలు కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆయన్ను అడ్డుకున్నారు. శతాబ్ది రైలును ఎక్కేందుకు ఆయన రాగా, ఆప్ మంత్రులంతా మహిళలను వేధిస్తున్నారని ఆరోపిస్తూ, తాజాగా సెక్స్ వీడియోల్లో కనిపించి పదవిని కోల్పోయిన సందీప్ కుమార్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్లాట్ ఫాంపై కేజ్రీవాల్ నడుస్తుంటే ఆయన చుట్టూ చేరి నినాదాలు చేస్తుండటం విజువల్స్ లో కనిపిస్తోంది. ఆపై కేజ్రీవాల్ స్పందిస్తూ, తన పర్యటన షెడ్యూల్ ను భద్రతాధికారులకు తప్ప ఎవరికీ చెప్పలేదని అన్నారు. ఢిల్లీ పోలీసులే తన ప్రయాణం గురించి ముందే లీక్ చేసి నిరసనలను ప్రోత్సహించారని ఆరోపించారు. తాను ఇక్కడికి వస్తున్నట్టు నిరసనకారులకు, టీవీ చానళ్లకు ఎవరు చెప్పారని ప్రశ్నించారు. తన చుట్టూ చేరి ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు పక్కకు కూడా తప్పించలేదని, ఇది సెక్యూరిటీ నిబంధనల ఉల్లంఘనేనని అన్నారు.

More Telugu News