: మార్కెట్లో ఈ ఏటి సూపర్ ఫోన్ ఐఫోన్ 7; యాపిల్ వాచ్ లు... పూర్తి స్పెసిఫికేషన్లు, బుకింగ్స్, ధరల వివరాలు!

ఈ సంవత్సరపు సూపర్ ఫోన్ గా టెలికం నిపుణులు వ్యాఖ్యానించిన ఐఫోన్ తాజా సిరీస్ ఫోన్లు శాన్ ఫ్రాన్సిస్కోలోని బిల్ గ్రాహం సివిక్ ఆడిటోరియంలో అట్టహాసంగా జరిగిన వేడుకలో మార్కెట్లోకి విడుదలయ్యాయి. భారీగా తరలివచ్చిన అభిమానులు, డీలర్ల సమక్షంలో ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్, స్మార్ట్ వాచ్ లను యాపిల్ సీఈఓ టిమ్ కుక్ వీటిని ఆవిష్కరించారు. 'ఐఫోన్ 7' 4.7 అంగుళాల స్క్రీన్ తో, 7 ప్లస్ 5.5 అంగుళాల స్క్రీన్ తో ఉంటాయి. తామందించిన పాత మోడల్స్ తో పోలిస్తే వీటిల్లో ఎన్నో విభాగాల్లో అప్ గ్రేడ్ చేశామని, వాటర్, డస్ట్ రెసిస్టెంట్ వేరియంట్లుగా, డ్యూయల్ లెన్స్ కలిగిన స్మార్ట్ ఫోన్లుగా ఇవి ఉంటాయని, సెన్సిటివ్ హోం బటన్, రీ డిజైన్ చేసి టచ్ ప్రెజర్ అదనపు ఆకర్షణలని ఆయన వివరించారు. ఇప్పటివరకు తాము తయారుచేసిన స్మార్ట్ ఫోన్లలో ఐఫోన్ 7 అత్యుత్తమమని టిమ్ కుక్ అభివర్ణించడం గమనార్హం. ఇక ఫోన్ ముందస్తు బుకింగ్స్ 9వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని, 16వ తేదీ నుంచి 12 దేశాల్లో ఈ ఫోన్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. గోల్డ్, రోజ్ గోల్డ్, సిల్వర్, జెట్ బ్లాక్ రంగుల్లో లభ్యమయ్యే ఫోన్లలో ఐఫోన్ 7 ధర 599 పౌండ్లుగా (సుమారు రూ. 53,328), ఐఫోన్ 7 ప్లస్ ధర 659 పౌండ్లుగా (సుమారు రూ. 58,670) నిర్ణయించారు. ప్రపంచ మొబైల్ చరిత్రలో తొలిసారిగా 3.5 ఎంఎం జాక్ సాయంతో ఇయర్ ఫోన్స్ వాడకాన్ని నిలిపివేస్తూ, దాని స్థానంలో 'ఎయిర్ పాడ్స్' పేరిట వైర్ లెస్ హెడ్ ఫోన్లను ప్రవేశపెడుతున్నట్టు టిమ్ కుక్ తెలిపారు. దీన్ని అదనంగా కొనుక్కోవాల్సి వుంటుంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్లలోని ముఖ్యమైన ఫీచర్ల విషయానికి వస్తే... * స్టీరియో స్పీకర్ల సదుపాయం ఉంటుంది. * లైటెనింగ్ పోర్ట్‌నే ఆడియోజాక్‌ గా వాడుకోవచ్చు. * నీటిలో పడ్డా, అధికంగా దుమ్ము పడ్డా చెడిపోవు. * మరింత మెరుగైన బ్యాటరీ లైఫ్: ఐఫోన్ 6తో పోలిస్తే 7 వర్షన్ బ్యాటరీలో రెండు గంటలు అధిక టాక్ టైం లభిస్తుంది. 7 ప్లస్ వర్షన్ లో ఒక గంట అదనపు టాక్ టైం లభిస్తుంది. * 64 బిట్ ఫోర్ కోర్ సీపీయూతో ఏ10 ఫ్యూజన్ చిప్ ను వాడారు. * 32 జీబీ, 128 జీబీ, 256 జీబీ స్టోరేజ్ సామర్థ్యంతో లభిస్తాయి. * ఇమేజ్ స్టెబిలైజేషన్ కోసం ఎఫ్/1.8 అపిర్చ్యూర్ తో 6 ఎలిమెంట్ లెన్స్ వాడారు. * 7లో ఒక కెమెరా, 7 ప్లస్ లో రెండు కెమెరాలు ఉంటాయి. * పాత ఐఫోన్ మోడల్స్ తో పోలిస్తే ఇవి 60 శాతం వేగంగా పనిచేస్తాయి. * 7 ప్లస్ లో కొత్తగా 'పోర్ట్ రెయిట్' ఎఫెక్ట్ ను జోడించారు. * ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, 2 ఎక్స్ ఆప్టికల్ జూమ్, 10 ఎక్స్ డిజిటల్ జూమ్‌ లు అదనపు ఆకర్షణ. * 30 నిమిషాల పాటు నీటిలో ఉంచినా ఫోన్ చెడిపోదు. ఈ రెండు ఫోన్ వేరియంట్ల మధ్య పెద్దగా మార్పులేమీ కనిపించలేదు. చూడటానికి మాత్రం ఐఫోన్ 6తో పోలిస్తే ఇంకాస్త సన్నగా ఉన్న ఈ ఫోన్లు 138.3 ఎంఎం పొడవు, 67.1 ఎంఎం వెడల్పు, 7.1 ఎంఎం మందంతో ఉన్నాయి. 6, 6 ఎస్ వేరియంట్లలో మాదిరిగానే వెనుకవైపు 12 ఎంపీ, ముందు 7 ఎంపీ కెమెరాలుండగా, వెనుకవైపున 7 ప్లస్ వేరియంట్ లో రెండు కెమెరాలు అమర్చారు. ఇక యాపిల్ వాచ్ సిరీస్ 2 విషయానికి వస్తే... యాపిల్ వాచ్ సిరీస్ 2 జీపీఎస్ కనెక్టివిటీతో మరింత వేగవంతమైన ప్రాసెసర్ తో లభిస్తుంది. దీని ధర 369 పౌండ్లు (సుమారు రూ. 32,852)గా నిర్ణయించారు. ఈ వాచ్ నీటిలో 50 మీటర్ల కిందకు పడిపోయినా పాడైపోదు. గతంలో వచ్చిన వాచ్ మోడళ్లతో పోలిస్తే 50 శాతం వేగంగా పనిచేస్తుంది. రెండు రెట్ల కాంతిమంతమైన స్క్రీన్ ఉంటుంది. బిల్ట్ ఇన్ జీపీఎస్ సదుపాయం ఉన్న కారణంగా మీ స్మార్ట్ ఫోన్ ను ఇంట్లోనే పెట్టేసి ఈ వాచ్ చేతికి పెట్టుకుని పరుగు తీయొచ్చు. ఈ వాచ్ లో పోకేమాన్ గో యాప్ ప్రీలోడెడ్ గా ఉండటం అనదపు ఆకర్షణ. లోఎండ్ వర్షన్ స్టెయిన్ లెస్ స్టీల్ తో తయారు కాగా, హైఎండ్ వర్షన్ ను సిరామిక్ తో తయారు చేశారు. సిరామిక్ వాచ్ ధర 1249 పౌండ్లుగా (సుమారు రూ. 1.11 లక్షలు) నిర్ణయించారు. ఈ ఫోన్, వాచ్ మోడళ్లతో పాటు ఎయిర్ పాడ్స్ పేరిట వైర్ లెస్ హెడ్ ఫోన్లను 159 పౌండ్ల (సుమారు రూ. 14,155)కు విడుదల చేస్తున్నట్టు యాపిల్ ప్రకటించింది. అయితే, ఐఫోన్ 7 తీసుకున్న వారికి లైటెనింగ్ పోర్ట్ సాయంతో పనిచేసే సంప్రదాయ హెడ్ ఫోన్లను ఇస్తూ, వాటి కనెక్టివిటీ నిమిత్తం ఓ ఎడాప్టర్ ను యాపిల్ అందించనుంది. ఇండియాలో ఐఫోన్ 7, 7 ప్లస్, వాచ్-2, ఎయిర్ పాడ్స్ అక్టోబర్ 7న విడుదలవుతాయని యాపిల్ ఓ ప్రకటనలో తెలిపింది. 32 జీబీ వేరియంట్ ధర రూ. 60 వేలుగా ఉంటుందని (దిగుమతి పన్నులు కలుపుకుని) తెలుస్తోంది.

More Telugu News