: అతని విజిటింగ్ కార్డే ఒక పుస్తకం... అతని పేరు పక్కన 145 డిగ్రీలు!

తమిళనాడులోని చెన్నైకు చెందిన పార్థీబన్‌ (50) అనే ప్రొఫెసర్ సాధించిన విద్యార్హతలు చూస్తే ఎవరైనా సరే షాక్ తినాల్సిందే. ఆయనను సరస్వతీ పుత్రుడని కొనియాడాల్సిందే. 50 ఏళ్ల వయసు కలిగిన ఆయన గత 30 ఏళ్లలో 145 డిగ్రీలు సాధించారంటే నమ్మశక్యం కాదు, కానీ, ఇది నిజం! ఆయన పేరు పక్కన 145 డిగ్రీలు ఉండడంతో ఆయన విజిటింగ్ కార్డు ఒక పుస్తకంలా ఉంటుంది. ఆయన న్యాయ విద్యలో 8, ఆర్ట్స్‌ లో 10, కామర్స్‌ లో 8, సైన్స్‌ లో 3, రీసెర్చ్‌ లో 12, బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్ లో 9 మాస్టర్‌ డిగ్రీలతో పాటు, మరో వంద వరకు డిగ్రీ పట్టాలు పొందారు. అంతేకాకుండా చెన్నైలోని పలు కళాశాలల్లో 100కు పైగా సబ్జెక్టులు బోధించడం విశేషం. ఇన్ని డిగ్రీలు చదవడం సాధ్యమా? ఎలా ఇంత కాలం చదివగలిగారు? అంటూ ఆయనను ఎవరైనా ప్రశ్నిస్తే మాత్రం నవ్వుతారు. తనకు చదవడమంటే చాలా ఇష్టమని చెబుతారు. చదివేందుకు తానేనాడూ కష్టపడలేదని అంటారు. అయితే తొలి డిగ్రీని సాధించేందుకు మాత్రం చాలా కష్టపడ్డానని ఆయన ఆనాటి రోజులను గుర్తు చేసుకుంటారు. ఆ కష్టమే తనను విద్యారంగం వైపు నడిపించిందని చెబుతారు. అది ఇష్టంగా మారిందని, ఏదైనా మనకు ఇష్టమైతే దానిని పదేపదే కావాలనుకుంటామని, తాను కూడా అంతేనని, ఆ ఇష్టంతోనే ఎక్కువ డిగ్రీలు సాధించానని చెబుతారు. ఇలా చదవడంలో అప్పుడప్పుడు తమాషా సంఘటనలు చోటుచేసుకునేవని, ఒక సబ్జెక్టుకు బదులు మరొక సబ్జెక్టు చదివి పరీక్షకు వెళ్లి ఫెయిల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయని ఆయన గుర్తుచేసుకున్నారు. చదవు ఇంతటితో ఆపనని, ఇకపై కూడా చదువుతానని ఆయన ప్రకటించారు.

More Telugu News