: అమరావతికి ప్రపంచ ఉత్తమ యూనివర్సిటీలు వస్తాయి!: చంద్ర‌బాబు

భ‌విష్య‌త్తులో క్షేత్రస్థాయిలో మంచి ఫ‌లితాలు రాబ‌ట్టేలా విద్యావిధానం అమ‌లు చేస్తామ‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అన్నారు. విజ‌య‌వాడలో ఈరోజు ఏపీ మాన‌వ‌వ‌న‌రుల శాఖ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన‌ గురుపూజోత్స‌వం కార్య‌క్ర‌మంలో ప‌లువురు మంత్రుల‌తో క‌లిసి చంద్ర‌బాబు పాల్గొన్నారు. ప‌లువురు ఉపాధ్యాయుల‌ను ఆయ‌న సత్క‌రించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ... పారిశ్రామిక విప్ల‌వంలో భాగంగా ఐటీ వ‌చ్చాక ప్ర‌పంచం కుగ్రామంగా మారిపోయిందని, ఐటీ రంగంలో యువ‌త‌కు మంచి ఉద్యోగావ‌కాశాలు ల‌భిస్తున్నాయ‌ని అన్నారు. ఐటీ రంగంపై మ‌రింత శ్ర‌ద్ధ పెట్ట‌నున్న‌ట్లు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో విద్యావ్య‌వ‌స్థ‌ను స‌మూలంగా మారుస్తామ‌ని చంద్రబాబు అన్నారు. టాప్ యూనివర్సిటీలు మన రాష్ట్రానికి వచ్చే ఉద్దేశంతో ప్రైవేటు వర్సిటీ బిల్లు తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. అమరావతికి ప్రపంచ ఉత్తమ యూనివర్సిటీలు వస్తాయని ఆయన చెప్పారు. రాష్ట్రంలో రియ‌ల్ టైమ్‌లో నీటి ల‌భ్య‌త ఎంత ఉందో తెలుసుకోగ‌లుగుతున్నామ‌ని, ఆశ్చ‌ర్యం క‌లిగించేలా విద్యార్థులు కొన్ని వినూత్న ప్ర‌యోగాలు చేస్తున్నారని ఆయ‌న అన్నారు. పుష్కరాల్లో సాంకేతికత సమర్థంగా వినియోగించిన‌ట్లు పేర్కొన్నారు. పిల్లలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ‘నీటి కొరత అనేది చాలా సున్నితమైన సమస్య.. నీరు ఉంటే ఏమైనా చెయ్యొచ్చు. వర్షపునీటిని భూగర్భ జలాలుగా మార్చుకోవాలి. దేశంలో మొదటిసారిగా నదుల అనుసంధానం చేసిన ఘనత ఏపీదే. రాబోయే రోజుల్లో రాయలసీమలో ఏ రైతైనా పంట వేస్తే ఆ పంట ఎండిపోయే అవకాశమే ఉండదు, అటువంటి చర్యలు తీసుకుంటున్నాం. రైతులకు ఏ కష్టాలు రాకుండా చూసుకుంటాం. ప్రణాళికతో ముందుకువెళితే సాధించలేనిది ఏదీ ఉండదు’ అని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.

More Telugu News