: ఐదవ తరం యుద్ధ విమానాల కోసం రష్యాతో భారత్ భారీ డీల్

అమెరికాతో రక్షణ సంబంధాలు ఇండియాకు అంతగా అనుకూలించేలా లేకపోతుండటంతో, సంప్రదాయ వ్యూహాత్మక భాగస్వామిగా సుదీర్ఘకాలంగా ఇండియాతో కలిసి నడుస్తున్న రష్యావైపు ఇండియా చూస్తోంది. ఐదవతరం యుద్ధ విమానాలను వాయుసేనకు అందించాలన్న లక్ష్యంతో రష్యాతో జరుపుతున్న చర్చలు ఫలవంతమయ్యే దిశగా సాగుతున్నాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఎఫ్జీఎఫ్ఏ (ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్)లతో పాటు కెమావ్ కేఏ-226టీ లైట్ యుటిలిటీ హెలికాప్టర్లు, 5 ఎస్-400 ట్రిఫ్ అడ్వాన్స్డ్ మిసైల్ సిస్టమ్స్ లను, రెండో న్యూక్లియర్ సబ్ మెరైన్ ను రష్యా నుంచి అందుకునేందుకు చర్చిస్తోంది. ఈ మొత్తం డీల్స్ విలువ రూ. 48 వేల కోట్ల వరకూ ఉండవచ్చని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే ఇండియా వద్ద అణ్వస్త్రాలను మోసుకెళ్లి ప్రయోగించే శక్తి సామర్థ్యాలున్న అకులా-2 సబ్ మెరైన్ (ఐఎన్ఎస్ చక్ర) సేవలందిస్తున్న సంగతి తెలిసిందే. సమీప భవిష్యత్తులో తాజా డీల్స్ పై తుది నిర్ణయానికి వచ్చేందుకు ద్వైపాక్షిక చర్చలు జరుగుతాయని అధికార వర్గాలు వెల్లడించాయి. రక్షణ రంగంలో విలీనాలను చూస్తున్న విభాగం డైరెక్టర్ జనరల్ నేతృత్వంలో రష్యా రక్షణ అధికారులతో చర్చలు జరుగుతాయని, నౌకల నిర్మాణం, ఏవియేషన్ విభాగానికి కొత్త యుద్ధ విమానాలు తదితరాలపై తుది నిర్ణయం వెలువడవచ్చని తెలుస్తోంది.

More Telugu News