: అన్నింటికీ ఓకే కానీ... ఆర్థిక లోటు భర్తీనే సమస్య!: కేంద్రం చర్చల్లో ప్రతిష్టంభన

రాష్ట్ర విభజన తర్వాత ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్న నవ్యాంధ్రను ఒడ్డున పడేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని దాదాపుగా తేల్చేసిన కేంద్రం... స్పెషల్ డెవలప్ మెంట్ ప్యాకేజీ పేరిట ప్రకటించనున్న ఆర్థిక సాయంలోనూ కేంద్రం మడత పేచీలు పెడుతున్నట్లు తెలుస్తోంది. నేటి ఉదయం కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో భేటీ అయిన ఏపీకి చెందిన కేంద్ర మంత్రి సుజనా చౌదరి, సీఎం రమేశ్ లు పలు విషయాలపై చర్చించారు. ఆ తర్వాత కేంద్రం వద్ద జరుగుతున్న చర్చలకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడుకు చేరవేస్తున్నారు. ఈ క్రమంలో తన ముందు ఏపీ పెట్టిన డిమాండ్లలో ప్రత్యేక హోదా మినహా దాదాపుగా అన్ని డిమాండ్లకు సరేనన్న కేంద్రం... తాజాగా మరో మెలిక పెట్టింది. ఏపీ ఆర్థిక లోటు భర్తీ విషయంలో తాము న్యాయం చేయలేమంటూ కేంద్రం అశక్తతను వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో కేంద్రం చర్చల్లో ఒక్కసారిగా ప్రతిష్టంభన నెలకొన్నట్లు సమాచారం. దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.

More Telugu News