: అన్నా హజారే తిట్లు తమకు దీవెనలేనంటున్న ఆమ్ ఆద్మీ

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పైనా, ఆమ్ ఆద్మీ పార్టీ వైఖరిపైనా సామాజిక ఉద్యమవేత్త అన్నా హజారే తీవ్ర విమర్శలు చేసిన వేళ, ఆ పార్టీ స్పందించింది. ఆయన తిట్లు తమకు దీవెనలేనని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా వ్యాఖ్యానించారు. ఆయన అభిప్రాయంలో నిజాయతీ ఉందని, తమను విమర్శిస్తున్నారంటే, అది ఆయనకు ఆమ్ ఆద్మీ పార్టీపై ఉన్న ప్రేమ, అప్యాయతలేనని సిసోడియా అన్నారు. పార్టీలో బాధ్యతా రాహిత్యంగా ప్రవర్తించే వారిపై వేగవంతమైన చర్యలను తీసుకుంటున్నామని చెప్పారు. తమ పార్టీని ఎవరు విమర్శించినా దాన్ని సద్విమర్శగా పరిగణించి తప్పు దిద్దుకునేందుకు యత్నిస్తామని ఆప్ నేత కుమార్ విశ్వాస్ వెల్లడించారు. కాగా, ఆప్ నేత కేజ్రీవాల్ సహచరుల్లో కొందరు జైలుకు వెళ్లడం, మరికొందరు మోసాలకు పాల్పడటం తనను కలచి వేస్తోందని అన్నా హజారే వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

More Telugu News