: నాపై భారతీయులు చూపించిన ప్రేమకు ధన్యవాదాలు: మిస్ వరల్డ్ జపాన్ ప్రియాంక

తాను భారతీయురాలిని కాకపోయినా భారతీయులు తనపై చూపించిన ప్రేమ మర్చిపోలేనిదని 'మిస్ వరల్డ్ జపాన్' ప్రియాంక యోషికవా అన్నారు. భారత్ మూలాలున్న ప్రియాంక(22) మిస్ వరల్డ్ జపాన్ కిరీటాన్ని గెలుచుకున్న అనంతరం మాట్లాడుతూ తనకు అండగా నిలిచిన భారతీయులకు ధన్యవాదాలు తెలిపారు. మిస్ జపాన్‌గా ఇతర దేశానికి చెందిన, ఆ మూలాలున్న వారు ఎప్పుడూ మిస్ జపాన్ పోటీల్లో పాల్గొనకపోవడంతో ప్రియాంకపై నిరసనలు వెల్లువెత్తాయి. కొందరు జాత్యహంకార వ్యాఖ్యలు చేశారు. సామాజిక మాధ్యమాల్లో అయితే ఆమెపైనే చర్చ జరిగింది. వాటన్నింటినీ తోసిరాజని ప్రియాంక మిస్ జపాన్‌గా ఎంపికైంది. డిసెంబరులో వాషింగ్టన్‌లో జరగనున్న మిస్ వరల్డ్ పోటీలో ఆమె పాల్గొననుంది. ప్రియాంక తండ్రి కోల్‌కతాకు చెందిన వారు. విద్యార్థిగా జపాన్ వెళ్లినప్పుడు ఆ దేశస్థురాలని పెళ్లి చేసుకుని అక్కడే స్థిరపడ్డారు. మిస్ జపాన్‌గా ఎంపికైన అనంతరం ప్రియాంక ఉద్విగ్నంగా మాట్లాడారు. ‘‘నేను భారతీయురాలిని కాకున్నా విజయం సాధించాలంటూ భారత్ నుంచి మెసేజ్‌లు వెల్లువెత్తాయి’’ అని పేర్కొన్నారు. మిస్ జపాన్‌గా ఎంపికైన ప్రియాంకకు ఏనుగు శిక్షకురాలి లైసెన్స్ కూడా ఉండడం గమనార్హం. తాను ఎన్నోమార్లు జాతి వివక్షను ఎదుర్కొన్నానని చెప్పిన ప్రియాంక దీనిపై పోరాడతానని పేర్కొన్నారు. నల్ల జాతి మూలాలున్న అరియానా మియామొటో మిస్ యూనివర్స్ జపాన్‌గా కిరీటం అందుకోవడం తనకు స్ఫూర్తినిచ్చిందని పేర్కొన్నారు. అరియానాపైనా సోషల్ మీడియాలో నిరసనలు వెల్లువెత్తాయి. ఆమె ప్రాతినిధ్యాన్ని జీర్ణించుకోలేని కొందరు జాతి వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. తాను తరచూ భారత్‌ను సందర్శిస్తుంటానని ప్రియాంక తెలిపారు. కోల్‌కతాలోని అనాథలకు సాయం అందించాలన్నదే తన అభిమతమని పేర్కొన్నారు. ‘‘అనాథలకు చేయూత అందించేందుకు కోల్‌కతాలో ఓ ఇల్లు నిర్మించాలనుకుంటున్నా. నా తండ్రి ప్రస్తుతం అదే పనిలో ఉన్నారు’’ అంటూ సామాజిక సేవపై స్పందించిన ఆమె సమాధానం విన్న న్యాయమూర్తులు ప్రియాంకకు మిస్ జపాన్ కిరీటం తొడిగారు. కాగా ప్రియాంక ముత్తాత ఒకరు మహాత్మాగాంధీని ఆహ్వానించి కోల్‌కతాలోని తన ఇంట్లో రెండు వారాలపాటు ఆతిథ్యం ఇవ్వడం విశేషం.

More Telugu News