: ముస్లిం యువకుల మానవత్వానికి అంతా ఫిదా అయిపోయారు

మహారాష్ట్రలోని థానే సమీపంలోని కౌసా ప్రాంతంలో ముస్లిం యువకులు చూపిన మానవత్వానికి సోషల్ మీడియాలో నెటిజన్లంతా అభినందనలు తెలుపుతున్నారు. వివరాల్లోకి వెళ్తే... కౌసా ప్రాంతంలో వామన్ కదమ్ (65) అనే వ్యక్తి తన భార్యతో కలిసి జీవిస్తున్నాడు. వారికి నా అన్నవారెవ్వరూ లేరు. అకస్మాత్తుగా ఆయన గత అర్ధరాత్రి మృతి చెందారు. దీంతో అంతవరకు జీవితం పంచుకున్న వ్యక్తి దూరం కావడంతో షాక్ కు గురైన అతని భార్యకు ఏం చేయాలో పాలుపోలేదు. సహాయం అడిగేందుకు నా అన్న వారు కూడా లేకపోవడంతో, ఆమె జరిగిన దారుణాన్ని చుట్టుపక్కల వారికి తెలిపింది. ఆమె నిస్సహాయ స్థితిని చూసిన అక్కడి ముస్లిం యువకులు 8 మంది ముందుకు వచ్చారు. వెంటనే వెదురు కర్రలు, తాడు, మట్టికుండ, ఇతర సామగ్రి కొనుగోలు చేసి పాడెను సిద్ధం చేశారు. భార్య కోరిక మేరకు తెల్లవారు జాము 3 గంటలకు అతని శవాన్ని మోసుకెళ్లి... హిందూ సంప్రదాయంలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ముస్లిం యువకుల మానవత్వాన్ని అభినందిస్తూ ముంబ్రా-కల్వా ఎమ్మెల్యే జితేంద్ర అహ్వద్ ఫేస్ బుక్ లో పోస్టు పెట్టగా, వారిని అంతా అభినందిస్తున్నారు.

More Telugu News