: రూ. 91 వేల కోట్ల నగదు నిధిపై కూర్చున్న రిలయన్స్ జియో... కస్టమర్ల కోసం మరింత తక్కువ ధరలు!

ఇండియాలోని అతిపెద్ద పారిశ్రామిక సంస్థల్లో ఒకటైన రిలయన్స్ ఇండస్ట్రీస్ వెన్నుదన్నుగా, సుమారు రూ. 91 వేల కోట్ల నగదు నిధిపై దర్జాగా కూర్చుని, అతి తక్కువ ధరలకు సెల్ ఫోన్ డేటా ఆఫర్లను ప్రకటించిన రిలయన్స్ జియో, తామనుకున్న మేరకు కస్టమర్లను ఆకర్షించడంలో విఫలమైతే మరింతగా డేటా చార్జీలను తగ్గించే అవకాశాలు ఉన్నాయని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. నిన్నటి నుంచి రిలయన్స్ జియో 4జీ సేవలు దేశవ్యాప్తంగా అందుబాటులోకి రాగా, ఈ సంవత్సరం చివరి వరకూ ఉచితంగా అందనున్న సంగతి తెలిసిందే. ఇక జనవరి 1, 2017 నుంచి కమర్షియల్ సేవలను అందించాలని నిర్ణయించిన రిలయన్స్ జియో, అప్పటికి డేటా చార్జీలను ఇంకాస్త తగ్గిస్తూ ప్రకటించి పోటీలో ఉన్న భారతీ ఎయిర్ టెల్, ఐడియా సెల్యులార్ లను మరింత ఒత్తిడిలోకి నెట్టవచ్చని టెలికం నిపుణులు అంచనా వేస్తున్నారు. జియో భవిష్యత్తు ధరవిధానం మరింత తక్కువకు కస్టమర్లకు సేవలందించేలా ఉండవచ్చని అంచనా వేస్తున్నట్టు తెలుస్తోంది. హైఎండ్ కస్టమర్లకు మరింత తక్కువ ధరకు ప్యాకేజీతో పాటు, వివిధ కంపెనీలకు బల్క్ ఆఫర్లను అందించవచ్చని జియోకు చెందిన ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఉచిత వాయిస్ కాల్స్, అతి తక్కువ ధరకు డేటా దీర్ఘకాలంలో ఏ మేరకు కొనసాగుతుందన్న ప్రశ్న ఉదయిస్తున్న వేళ, బలమైన రిలయన్స్ ఇండస్ట్రీస్ బ్యాలెన్స్ షీట్ తనవంతు తోడ్పాటును అందించి, సాధ్యమైనంత ఎక్కువ కాలం పాటు తక్కువ ధరలను అందించేలా చూడవచ్చని ఓ ప్రముఖ విదేశీ బ్రోకరేజ్ సంస్థ అనలిస్ట్ అభిప్రాయపడ్డారు. ఇదే విషయమై ఎయిర్ టెల్ మాజీ సీఈఓ సంజయ్ కపూర్ స్పందిస్తూ, "జనవరి 1 నాటికి ఎంత మంది క్వాలిటీ కస్టమర్లను జియో ఆకర్షిస్తుందో వేచిచూడాలి. ఇక వీఓఎల్టీఈ, ఇతర నెట్ వర్క్ ల మధ్య సమన్వయం ఎలా ఏర్పడుతుంది, ఇంటర్ కనెక్టివిటీకి చెల్లించాల్సిన డబ్బు తదితరాంశాలపై జియో వ్యూహం ఎలా ఉంటుందో వేచి చూడాలి" అన్నారు.

More Telugu News