: కేజ్రీవాల్‌పై నేను పెట్టుకున్న అశలు అడియాసలయ్యాయి.. అన్నా హజారే ఆవేదన

ఒకప్పటి తన సహచరుడు, ప్రస్తుత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై అన్నా హజారే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయనపై తాను పెట్టుకున్న ఆశలు అడియాసలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేజ్రీవాల్ ప్రభుత్వంలోని కొందరు మంత్రులు జైలుకు వెళ్లడం, మరికొందరిపై ఆరోపణలు రావడం తనను ఆవేదనకు గురిచేస్తోందన్నారు. ‘‘నాకు చాలా ఆవేదనగా ఉంది. కేజ్రీవాల్ నాతో ఉన్నప్పుడు ‘గ్రామ్ స్వరాజ్’ పేరుతో ఓ పుస్తకం రాశాడు. మరి ఇదేనా గ్రామ స్వరాజ్యం? ఈ విషయంలో నాకు చాలా బాధగా ఉంది. ఆయనపై నేను పెట్టుకున్న ఆశలు ఆవిరి అయ్యాయి’’ అని హజారే ఆవేదన వ్యక్తం చేశారు. మహిళపై అత్యాచారం కేసులో ఆ పార్టీ మాజీ మంత్రి సందీప్ కుమార్ అరెస్టయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన మూడు రోజుల పోలీసు కస్టడీలో ఉన్నారు. అలాగే మరికొందరు ఆప్ నేతలపైనా ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో హజారే స్పందించారు. నీ పార్టీలో చేరే వ్యక్తులు మంచివారో, చెడ్డవారో ఎలా గుర్తిస్తావని కేజ్రీని పార్టీ పెట్టిన రోజే ప్రశ్నించానని, దానికి ఆయన సమాధానం చెప్పలేకపోయారని హజారే గుర్తు చేసుకున్నారు. కానీ అది ఇప్పుడు నిజమైందన్నారు. ఇది అన్ని పార్టీలకు వర్తిస్తుందని, పార్టీలో చేరే వ్యక్తులు మంచివారో కాదో ముందే తెలుసుకోవాలని సూచించారు. ‘‘కేజ్రీ నాతో చాలా సంవత్సరాలు ఉన్నాడు. పార్టీ పెట్టాక దేశ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయానికి ఆయన నాంది పలుకుతాడని భావించా. కానీ ఇప్పుడా ఆశలు కోల్పోయా. నా సహచరుడిని ఇలా చూడడం చాలా బాధగా ఉంది’’ అని హజారే ఆవేదన వ్యక్తం చేశారు.

More Telugu News