: కృష్ణా బోర్డు తీర్పు ఏకపక్షమే!... కేంద్రానికి ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీకి హరీశ్ రావు!

కృష్ణా నదీ జలాలకు సంబంధించిన రాష్ట్రాల అభ్యంతరాలను పరిశీలించడమే కాకుండా వాటిని పరిష్కరించే కీలక బాధ్యతల్లో ఉన్న కృష్ణా నదీ జలాల యాజమాన్య బోర్డు (కేఆర్ బీఎం)పై తెలంగాణ సర్కారు ఆగ్రహావేశాలతో రగిలిపోతోంది. ఇటీవలే విడతలవారీగా నిర్వహించిన భేటీల్లో భాగంగా తెలంగాణ, ఏపీలకు నీటి కేటాయింపులపై బోర్డు కీలక తీర్పు చెప్పింది. బోర్డు ఆదేశాల ప్రకారం ఏపీకి ఎక్కువగా నీటి వాటా దక్కగా... తెలంగాణకు తక్కువ వాటా దక్కింది. దీనిపై తెలంగాణ సర్కారు ఆగ్రహావేశాలతో రగిలిపోతోంది. ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్న బోర్డు... ఏపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తోంది. ఏకపక్ష వైఖరితో వ్యవహరిస్తున్న బోర్డు కారణంగా తమకు దక్కాల్సిన న్యాయమైన వాటా దక్కడం లేదని కూడా తెలంగాణ ఆవేదన వ్యక్తం చేస్తోంది. దీనిపై మౌనంగా ఉంటే మరింత నష్టం జరిగే ప్రమాదం లేకపోలేదన్న భయాందోళనలు కూడా తెలంగాణ సర్కారులో నెలకొన్నాయి. ఈ క్రమంలో బోర్డు వైఖరిపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడమే మంచిదని కేసీఆర్ సర్కారు భావించింది. అనుకున్నదే తడవుగా ఆ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు హస్తిన పయనమవుతున్నారు. నేటి ఉదయం ఢిల్లీ వెళ్లనున్న ఆయన బోర్డు వ్యవహారంపై కేంద్రానికి ఫిర్యాదు చేయనున్నారు.

More Telugu News