: ట్రిపుల్ తలాక్ పై స్పందించండి!... కేంద్రానికి నాలుగు వారాల టైమిచ్చిన సుప్రీంకోర్టు!

ముస్లిం వివాహ బంధంలో వివాదాస్పదంగా మారిన ట్రిపుల్ తలాక్ వ్యవహారం కేంద్ర ప్రభుత్వం తలకు చుట్టుకుంది. పెళ్లి చేసుకున్న మహిళకు కేవలం మూడు సార్లు తలాక్ చెబుతున్న ముస్లిం పురుషులు క్షణాల్లో విడాకులు తీసుకుంటున్నారని, ఈ సంప్రదాయాన్ని చట్ట విరుద్ధమైనదిగా ప్రకటించాలని కోరుతూ పలువురు ముస్లిం మహిళలు సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే పలుమార్లు విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం... నేడు కూడా మరోమారు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ రంజిత్ కుమార్ విచారణకు హాజరయ్యారు. ఈ వ్యవహారంపై కేంద్రం స్పందనను సుప్రీంకోర్టు కోరగా, సొలిసిటర్ జనరల్ తమకు మరింత సమయం కావాలని అడిగారు. దీనికి సానుకూలంగా స్పందించిన దర్మాసనం నాలుగు వారాల్లోగా స్పందన తెలియజేయాలంటూ కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది.

More Telugu News