: ఆవు పొట్టలో వంద కిలోల చెత్త.. మేకులు, స్క్రూలు కూడా.. షాక్ తిన్న వైద్యులు

గడ్డి కోసం పశువులు ఎంతగా అల్లాడిపోతున్నాయో చెప్పేందుకు ఇది చక్కని ఉదాహరణ. కడుపు నిండా గడ్డి మేయలేని గోవులు పట్టణాల్లో ఏమూల చూసినా కనిపించే ప్లాస్టిక్ కవర్లు, చెత్తాచెదారాన్ని మేసేసి కడుపు నింపుకుంటున్నాయి. అహ్మదాబాద్‌లోని జివ్‌దయా చారిటబుల్ ట్రస్ట్ ఆస్పత్రి వైద్యులు ఓ గోవు కడుపులో చెత్తను చూసి ఆశ్చర్యపోయారు. దాని కడుపులో మొత్తంగా వంద కిలోల చెత్త ఉంది. అందులో మేకులు, ప్లాస్టిక్ బ్యాగులు, సాక్సులు కూడా ఉండడం గమనార్హం. శబర్మతీ ప్రాంతంలో నడవడానికి ఇబ్బందిపడుతున్న ఓ గోవును రక్షించిన వైద్యులు దానికి పరీక్షలు నిర్వహించగా ఈ విషయం బయటపడింది. గర్భంతో ఉండడం, నడవడానికి ఇబ్బందులు పడుతుండడంతో వైద్యులు దానికి చికిత్స చేశారు. ఈ సందర్భంగా దాని కడుపులో పేరుకుపోయిన చెత్తను గుర్తించి ఆపరేషన్ చేసి తొలగించారు. ఆపరేషన్ సందర్భంగా మూడు బకెట్ల చెత్తను తొలగించారు. అందులో ఎక్కవ శాతం ప్లాస్టిక్ కవర్లు, వైర్లు, మేకులు, స్క్రూలు ఉన్నట్టు చారిటబుల్ ట్రస్టుకు చెందిన కార్తీక్ శాస్త్రి తెలిపారు. ఆవు కడుపు నుంచి ప్లాస్టిక్ బ్యాగులు తొలగించడం ఇదే మొదటిసారి కాదని, గతంలోనూ ఓ ఆవు కడుపు నుంచి 40 కేజీల చెత్తను తొలగించినట్టు కార్తీక్ పేర్కొన్నారు.

More Telugu News