: పాతాళానికి పడిపోయిన టమాటా ధర... రైతుల గగ్గోలు!

నిన్న మొన్నటి వరకూ 25 కిలోల టమాటా బాక్స్ కు రూ. 100 పలికిన ధర ఇప్పుడు ఏకంగా రూ. 40కి పడిపోయింది. కిలోకు రూ. 2 కూడా రాకపోవడంతో, పంటను కోసి, మార్కెట్ కు చేర్చినా వృథాయేనని భావిస్తున్న రైతాంగం పంటను పొలంలోనే వదిలివేస్తోంది. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా వికారాబాద్ పరిసరాల్లో వేసిన టమాటా పంట, ఒక్కసారిగా చేతికి రావడంతోనే డిమాండ్ తగ్గి, ధరలు పడిపోయాయని మార్కెట్ యార్డు అధికారులు తెలిపారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి సికింద్రాబాద్ మార్కెట్ కు వస్తున్న టమాటాకు నెల రోజుల క్రితం కిలోకు రూ. 4 నుంచి రూ. 5 వరకూ లభించగా, రెండు వారాల క్రితం అది రూ. 2.50కి పడిపోయింది. ఇప్పుడు ఆ మాత్రం ధర కూడా లభించడం లేదు. మరోవైపు బహిరంగ మార్కెట్లో సైతం కిలో టమాటా ధర రూ. 6 మాత్రమే పలుకుతోంది. ఇక టమాటా రైతులను ఆదుకునేందుకు కిలోకు రూ. 5 చెల్లిస్తామని కేసీఆర్ సర్కారు హామీ ఇచ్చినప్పటికీ, అది అమల్లోకి రాలేదని రైతులు వాపోయారు. కిలోకు కనీసం రూ. 10 ఇచ్చి తమ పొలాల వద్ద కొనుగోలు చేస్తేనే పెట్టిన పెట్టుబడుల మేరకు తమకు తిరిగి వస్తుందన్నది రైతుల వాదన. కిలోకు రూ. 5పై టమాటాను కొనాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదని మార్కెట్ యార్డు అధికారులు చెబుతున్నారు.

More Telugu News