: ఇకపై ఖరీదైన రైళ్లలో మ్యారేజ్ లు.. హనీమూన్లకు ప్రత్యేక ప్యాకేజ్ లు!

గ్రాండ్ గా, మరింత గ్రాండ్ గా, వినూత్నంగా వివాహం చేసుకోవాలనుకునేవారికి భారత్ లోని ఖరీదైన రైళ్లు వేదిక కానున్నాయి. భారతీయ రైల్వేకు చెందిన క్యాటరింగ్, టూరిజం కార్పొరేషన్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. భారత్ లోని ఖరీదైన రైళ్లు మహారాజా ఎక్స్ ప్రెస్, ప్యాలెస్ ఆన్ వీల్స్, డెక్కన్ ఒడిస్సీ, గోల్డెన్ చారియట్, రాయల్ రాజస్థాన్ ఆన్ వీల్స్ రైళ్లను ఈ పెళ్లిళ్లకు కేటాయించాలని క్యాటరింగ్, టూరిజం కార్పొరేషన్ నిర్ణయించింది. పెళ్లి వేడుకలకు తగ్గట్లుగా ఎప్పటికప్పుడు రైలు డెకరేషన్ మార్చేందుకు, పసందైన విందు భోజనాలు, వినోద కార్యక్రమాలను ఏర్పాటు చేేసేందుకు నిపుణులైన ఈవెంట్ మేనేజర్లు ఉంటారు. ఈ సందర్భంగా సంబంధిత సీనియర్ అధికారులు మాట్లాడుతూ, రైళ్లలో ప్రయాణం చేస్తూనే పెళ్లిళ్లు చేసుకోవచ్చని, బస ఎన్ని రోజులు, ఉపయోగించుకునే వసతులు, ప్యాకేజ్ ల ఆధారంగా ధరలు ఉంటాయన్నారు. స్పా లాంటి సౌకర్యాలు కూడా ఉంటాయని చెప్పారు. వీటితో పాటుగా, వధూవరుల హనీమూన్ కోసం ప్రత్యేక ప్యాకేజ్ లు కూడా ఉంటాయన్నారు. భారతీయులు, ఎన్ఆర్ఐలను మాత్రమే కాకుండా విదేశీ జంటలు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పర్యాటకులను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రత్యేక ప్యాకేజ్ లను త్వరలో రూపొందిస్తామని చెప్పారు.

More Telugu News