: 'ఇస్తారా?... ఫ్రెండ్లీ గుడ్ బై చెబుతారా?'... బాబు అంతిమ అస్త్రమే పనిచేసింది!

ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో అవశేష రాష్ట్రానికి ఇస్తామన్న హామీల విషయమై గత రెండు రోజులుగా తీవ్ర కసరత్తు జరుగుతున్న వేళ, కేంద్రంలో ఇంత అకస్మాత్తుగా కదలిక రావడానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రయోగించిన 'అంతిమ అస్త్రం' కారణమని తెలుస్తోంది. హామీల మేరకు సాయం చేసే ఉద్దేశం ఉందా? లేదా? అని బీజేపీ నేతలను ప్రశ్నించిన బాబు, సాయపడేందుకు ఇబ్బందులు ఉంటే, స్నేహపూర్వకంగా విడిపోదామని స్పష్టం చేయడంతోనే, విషయాన్ని సీరియస్ గా తీసుకున్న అమిత్ షా కదిలినట్టు తెలుస్తోంది. గడచిన రెండు సంవత్సరాలుగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయమై చంద్రబాబు, పలుమార్లు ఢిల్లీ పెద్దలతో కలసి చర్చించి ఒత్తిడి తెస్తూనే ఉన్నప్పటికీ, ఇంత గట్టిగా ఎన్నడూ మాట్లాడలేదు. కేంద్రం హోదా ఇవ్వదన్న అభిప్రాయం ప్రజల్లో పెరుగుతూ, ఆ వ్యతిరేకత తెలుగుదేశం పార్టీపై పడకముందే మేలుకోవాలన్న చంద్రబాబు ఆలోచన, ఆయన నోటి వెంట తొలిసారి 'బ్రేకప్' మాట వచ్చేలా చేసింది. ఇటీవలి పార్లమెంట్ సమావేశాల తరువాత తన అభిప్రాయాన్ని బీజేపీ నేతల ముందు చంద్రబాబు కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లయిందని గుర్తు చేసిన ఆయన, ఇంకా వేచి చూస్తే, హోదా ఇచ్చినా వృథాయే అవుతుందని, బీజేపీ హామీని నిలబెట్టుకోకుంటే, కలిసున్న పాపానికి టీడీపీ నష్టపోతుందని స్పష్టం చేసిన ఆయన, హోదా ఇవ్వకుంటే విడాకులు తప్ప మరో మార్గం లేదని చెప్పడంతోనే ఏపీకి సాయంపై కసరత్తు వేగవంతమైంది.

More Telugu News