: ప్రయాణికుల గూబ గుయ్ మనిపించిన ఉబర్.. వనస్థలిపురం నుంచి హైటెక్ సిటీకి రూ.3,566 వసూలు

బుధవారం భారీ వర్షంతో నగర ప్రజలు ఓవైపు అల్లాడిపోతుంటే మరోవైపు ‘ఉబర్ క్యాబ్’ తమ ప్రయాణికులకు కోలుకోలేని షాకిచ్చింది. ఎన్నడూ, ఎక్కడా కనీవినీ ఎరుగని స్థాయిలో చార్జీలు వసూలు చేసి జేబులు గుల్ల చేసింది. సందీప్ కుమార్ అనే వ్యక్తి నిన్న ఉదయం వనస్థలిపురం నుంచి హైటెక్ సిటీలోని రహేజా మైండ్‌ స్పేస్‌కు ఉబర్ క్యాబ్ బుక్ చేసుకున్నాడు. గమ్యస్థానం చేరాక రూ.3,566 ఫేర్ చూసి అవాక్కయ్యాడు. ఉబర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన ఈ విషయాన్ని ట్వీట్ చేశాడు. ‘వనస్థలిపురం నుంచి హైటెక్ సిటీకి అత్యంత చీప్ రేట్ ఇదే’ అని తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. అయితే ఈ అనుభవం ఒక్క సందీప్‌కే ఎదురవలేదు. మరెందరో ‘ఉబర్’ బాధితులు ఉన్నారు. రోహిత్ అక్షయ్ అనే మరో ఉద్యోగి సికింద్రాబాద్‌లోని రైల్ నిలయం నుంచి నానక్‌రామ్‌గూడకు ట్యాక్సీ బుక్ చేసుకుని రూ.1,518 చెల్లించుకున్నాడు. సాధారణ రోజుల్లో ఈ ఫేర్ రూ.387. ఐటీ ఉద్యోగి ప్రత్యూష మెహదీపట్నం నుంచి గచ్చిబౌలికి ఉబర్ క్యాబ్ బుక్ చేసుకున్నారు. అయితే రూ.730 చార్జీ అవుతుందని తన మొబైల్ కి మెసేజ్ రావడంతో వెంటనే ఆమె దానిని రద్దు చేసుకున్నారు. మామూలు రోజుల్లో ఈ ఫేర్ రూ.160. బుధవారం నగరవాసులు ఎదుర్కొన్న అనుభవాల్లో ఇవి కొన్ని మాత్రమే. వర్షాన్ని సాకుగా చూపి ఉబర్, ఓలా క్యాబ్స్ బుధవారం ప్రయాణికులను నిలువునా ముంచేశాయని పలువురు ఆరోపిస్తున్నారు. సాధారణ ధరకంటే నాలుగైదు రెట్లు, అంతకంటే ఎక్కువ వసూలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెలాఖరు కావడం, జేబుల్లో చిల్లిగవ్వ లేకపోవడంతో ట్యాక్సీ ఫేర్లతో ఇబ్బందులు పడాల్సి వచ్చిందని, ఈ విషయంలో ఢిల్లీ ప్రభుత్వంలా ధరల నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పలువురు బాధితులు కోరుతున్నారు. దీనిపై స్పందించిన రవాణా శాఖామంత్రి మాట్లాడుతూ త్వరలోనే ధరల నియంత్రణకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఓలా, ఉబర్ సర్వీసుల్లా యాప్‌ ద్వారా ప్రభుత్వం నుంచి ఇటువంటి సేవలను అందించేందుకు ప్రయత్నిస్తామని పేర్కొన్నారు.

More Telugu News