: భారత్ ను చూసి చైనా నేర్చుకోవాలి: జాన్ కెర్రీ

భారత్ ను చూసి చైనా నేర్చుకోవాలని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి జాన్ కెర్రీ హితవు పలికారు. బారత పర్యటనలో ఉన్న జాన్ కెర్రీ ఢిల్లీ ఐఐటీ విద్యార్థులతో మాట్లాడుతూ, అంతర్జాతీయ ట్రైబ్యునల్ తీర్పును ఎలా గౌరవించాలో భారత్ ను చూసి నేర్చుకోవాలని హితవు పలికారు. బంగ్లాదేశ్ తో సముద్ర జలాల సరిహద్దు వివాదంలో అంతర్జాతీయ ట్రైబ్యునల్ తీర్పును అంగీకరించడం ద్వారా భారత్ తన విశిష్టతను చాటుకుందని ఆయన కొనియాడారు. వివిధ ప్రాంతాల్లో సరిహద్దు వివాదాలు ప్రమాదకరంగా పరిణమిస్తున్న ప్రస్తుత సమయంలో ఈ విధానం ప్రపంచానికి ఆదర్శంగా ఉంటుందని ఆయన చెప్పారు. దక్షిణ చైనా సముద్రం సహా ప్రపంచ వ్యాప్తంగా పలు వివాదాల శాంతియుత పరిష్కారానికి ఈ విధానం అనుసరణీయమని ఆయన సూచించారు. కాగా, దక్షిణ చైనా సముద్రం మొత్తం తనదేనని, దానిలో మరే దేశానికి హక్కు లేదని చైనా వాదిస్తున్న సంగతి తెలిసిందే. దక్షిణ చైనా సముద్ర వివాదంలో సైనిక చర్యకు తావులేదని ఆయన స్పష్టం చేశారు. కష్టకాలంలో తమ మిత్రులకు అమెరికా అండగా నిలబడుతుందని ఆయన ప్రకటించారు.

More Telugu News