: అనంత‌పురం అంటే నాకు ప్ర‌త్యేక‌మైన అభిమానం: ముఖ్యమంత్రి చ‌ంద్ర‌బాబు

మనల్ని చూసి కరవే దూరమయిపోయేలా ధైర్యం పెంచుకోవాలని ఆంద్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చ‌ంద్ర‌బాబు నాయుడు అన్నారు. ఈరోజు అనంత‌పురం జిల్లా వీరాపురంలో ప‌ర్య‌టించిన ఆయ‌న ఆ గ్రామ‌స్తుల‌తో ముఖాముఖి నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు మాట్లాడుతూ... అనంత‌పురం అంటే త‌న‌కు ప్ర‌త్యేక‌మైన అభిమానమ‌ని అన్నారు. కాంగ్రెస్ హ‌యాంలో వ్య‌వ‌సాయం భ్ర‌ష్టుప‌ట్టిందని ఆరోపించారు. ‘రాష్ట్రం విడిపోయింది, ఆస్తులు మ‌న‌కు రాలేదు.. ఆదాయం లేదు.. క‌ట్టుబ‌ట్ట‌ల‌తో వ‌చ్చాం. అయినా ఎన్నో సంక్షేమ ప‌థ‌కాల‌తో ముందుకు వెళుతున్నాం. పింఛ‌న్‌ని ఐదు రెట్లు పెంచి వెయ్యి రూపాయ‌లిస్తున్నాం’ అని ఆయన వ్యాఖ్యానించారు. ‘పెద్ద కొడుకుగా ఉంటాన‌ని ప్ర‌జ‌ల‌కు చెప్పా. ఆ మాట నిల‌బెట్టుకుంటున్నా. తెలుగుదేశానికి కంచుకోట అనంత‌పురం జిల్లా. కాంగ్రెస్ హ‌యాంలో ఎరువుల కొర‌త ఉండేది. విద్యుత్, విత్తనాల కొరత కూడా ఉండేది. కానీ ఇప్పుడు లేదు. శాస్త్రీయంగా, ప‌ధ్ధ‌తి ప్ర‌కారం వ్య‌వ‌సాయం జ‌ర‌గాలి. భూసార ప‌రీక్ష‌లు చేశాం. జిప్స‌మ్‌, బోరాన్ 50 శాతం రాయితీతో అందించాం. రాయ‌లసీమ‌ ఎడారిగా మార‌డానికి వీల్లేదు.. రాయ‌ల‌సీమ‌ను రత‌నాల సీమ‌గా మారుస్తాం’ అని చంద్ర‌బాబు నాయుడు వ్యాఖ్యానించారు. విత్త‌నాల కొర‌త లేకుండా ఆన్‌లైన్‌లో అందించే ఏర్పాటు చేసిన‌ట్లు చంద్ర‌బాబు పేర్కొన్నారు. క‌ర‌వును చూసి మ‌నం భ‌య‌ప‌డ‌కూడ‌దని, మ‌న కృషిని చూసి క‌ర‌వే భ‌య‌ప‌డి పారిపోవాల‌ని ఆయ‌న అన్నారు. అనంత‌పురంలో వేరుశ‌న‌గ ప‌రిశోధ‌న కేంద్రం, డైరెక్ట‌రేట్ ఏర్పాటు చేస్తామ‌ని చెప్పారు. రైతు సంక్షేమం కోసం తామెంతో కృషి చేస్తున్న‌ట్లు తెలిపారు. కాంగ్రెస్ హయాంలో ఉన్న ప్రతికూల పరిస్థితులు ఇప్పుడులేవని ఆయన అన్నారు. ప్రభుత్వం అందిస్తోన్న ప్రయోజనాలను ఉపయోగించుకుంటూ రైతులు ముందుకెళ్లాలని చంద్రబాబు సూచించారు.

More Telugu News