: మరింత పెరిగి 8 శాతానికి చేరువ కానున్న భారత్ జీడీపీ: గోల్డ్ మన్ సాక్స్

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత దేశ స్థూలజాతీయోత్పత్తి వృద్ధి 8 శాతానికి దగ్గరగా ఉండనుందని ఆర్థిక సేవల సంస్థ గోల్డ్ మన్ సాక్స్ అంచనా వేసింది. మంచి వర్షాలు, వేతన పెంపు, సంస్కరణల అమలు, పెరిగిన విదేశీ పెట్టుబడులు తదితరాలు జీడీపీని 7.9 శాతానికి పెంచనున్నాయని తన తాజా రీసెర్చ్ నోట్ లో గోల్డ్ మన్ సాక్స్ పేర్కొంది. ఏప్రిల్ - జూన్ త్రైమాసికంలో 7.8 శాతంగా ఉన్న వృద్ధి రేటు ప్రస్తుత త్రైమాసికంలో మెరుగుపడనుందని వెల్లడించింది. ఈ సంవత్సరం ఇండియా అంచనాలను మించిన వృద్ధి చూపనుందని తెలిపింది. కాగా, గత సంవత్సరంలో 7.5 శాతంగా తాను వేసిన భారత జీడీపీ అంచనాను ఈ సంవత్సరం ఆరంభంలో 7.7 శాతానికి సవరిస్తున్నట్టు గోల్డ్ మన్ సాక్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 7వ వేతన సంఘ సిఫార్సుల కారణంగా ఉద్యోగుల కొనుగోలు శక్తి పెరిగి అది జీడీపీ వృద్ధికి సహకరించనుందని, ద్రవ్య పరపతి విధానం సానుకూలంగా ఉండటం కూడా అందుకు సహకరిస్తోందని ఈ రీసెర్చ్ నోట్ లో సంస్థ పేర్కొంది.

More Telugu News