: మరోసారి ఇలా చేయవద్దు: కేబినెట్ ఆమోదం లేకుండా పంపిన ఆర్డినెన్సుపై నరేంద్ర మోదీకి నోట్ పంపిన రాష్ట్రపతి

లోక్ సభలో బలమున్నప్పటికీ, రాజ్యసభలో బిల్లులను ఆమోదించుకునే బలం లేని ఎన్డీయే సర్కారు, రాష్ట్రపతి ప్రత్యేక అధికారాలను వాడుకుంటూ, ఆర్డినెన్సుల రూపంలో బిల్లులు తీసుకు వస్తున్న వేళ, మంత్రిమండలి ఆమోదం లేకుండా తన వద్దకు వచ్చిన ఓ ఆర్డినెన్స్ పై ప్రణబ్ ముఖర్జీ తొలిసారిగా స్పందించారు. ఎన్డీయే సర్కారు ఒత్తిడితో ఇప్పటికే నాలుగుసార్లు ఆర్డినెన్స్ లపై సంతకాలు పెట్టిన ఆయన, ఈ దఫా క్యాబినెట్ ఆమోదం లేకుండా తన వద్దకు వచ్చిన ఆర్డినెన్స్ ను ఆక్షేపించారు. మరోసారి ఇలా చేయవద్దని ప్రధాని నరేంద్ర మోదీకి నోట్ రాసి పంపినట్టు తెలుస్తోంది. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని, కేబినేట్ ద్వారా రాని ఈ ఆర్డినెన్స్ పై సంతకం చేస్తున్నట్టు రాష్ట్రపతి ఆ నోట్ లో పేర్కొన్నట్టు సమాచారం. కాగా, తాజా ఆర్డినెన్స్ లో 48 సంవత్సరాల నాటి ఎనిమీ ప్రాపర్టీ చట్టానికి సవరణలు చేస్తూ, రూల్ 12ను వాడుకుంటూ, క్యాబినెట్ ఆమోదం లేకుండానే ఆర్డినెన్స్ పై సంతకం కోసం రాష్ట్రపతి వద్దకు దాన్ని పంపారు ప్రధాని. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఇలా క్యాబినెట్ ఆమోదం లేకుండా ఆర్డినెన్స్ ను రాష్ట్రపతి సంతకం కోసం పంపడం ఇదే తొలిసారి. యుద్ధాల తరువాత పాకిస్థాన్ లేదా చైనాకు వలస వెళ్లిన వారి ఆస్తులకు సంబంధించిన నిబంధనలను ఈ ఆర్డినెన్స్ సవరిస్తోంది. ఈ సంవత్సరం ఆరంభంలో లోక్ సభలో పాసైన చట్ట సవరణ బిల్లు, రాజ్యసభలో మాత్రం ఆగిపోయింది. దీన్ని ఆర్డినెన్స్ గా తీసుకువచ్చి అమలు చేయాలని మోదీ సర్కారు గతంలోనే నిర్ణయించింది.

More Telugu News