: తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు.. ఊపిరి పీల్చుకుంటున్న రైతులు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి రైతన్నలకు ఊపిరిపోస్తోంది. గత రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడుతుండడంతో రైతుల కళ్లలో ఆనందం కనిపిస్తోంది. నీరు తడి లేక ఎండిపోతున్న పంటలకు ఈ వర్షాలు ప్రాణం పోశాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు వాగులు, వంకలు నిండుతున్నాయి. జలకళతో ఉట్టిపడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని కడపలో భారీ వర్షం కురిసింది. జమ్మలమడుగులోని ఆర్టీసీ బస్టాండ్ పూర్తిగా జలమయమైంది. పెన్నానది ఉప్పొంగి ప్రవహిస్తోంది. భారీ వర్షానికి కర్నూలు జిల్లా నంద్యాలలో ఇళ్లలోకి నీరు చేరుకుంది. పలు చెరువులకు గండిపడడంతో నీరు పంటపొలాల్లోకి చేరుతోంది. శ్రీశైలంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గుంటూరు జిల్లాలో భారీ వర్షం కురిసింది. మాదలవాగు ఉద్ధృతికి సత్తెనపల్లి, నరసరావుపేట మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అద్దంకి, నార్కట్‌పల్లి జాతీయ రహదారిపైకి వరదనీరు వచ్చి చేరింది. కృష్ణా జిల్లా గన్నవరంలో కురిసిన భారీ వర్షానికి దుకాణాల్లోకి నీరు చేరింది. నందిగామలో అగ్నిమాపక కేంద్రం నీటమునిగింది. ఉభయ గోదావరి జిల్లాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఒంగోలులో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. తెలంగాణలోని నల్గొండ జిల్లాలో చెరువులు కళకళలాడుతున్నాయి. ఊరవాగు పొంగడంతో మఠంపల్లి, రఘునాథపాలెం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మెదక్ జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మరో రెండు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.

More Telugu News