: ఇక లాభంలేదు, ఏదో ఒకటి తేల్చండి... ఓ వైపు వెంకయ్య, మరోవైపు సుజనా... జైట్లీపై ఒత్తిడి!

ఆంధ్రప్రదేశ్ కు పార్లమెంట్ లో ప్రకటించిన ప్రత్యేక హోదా అంశంపై ఏదో ఒకటి తేల్చాల్సిన సమయం వచ్చిందని, దీనిపై తక్షణం నిర్ణయం తీసుకోకుంటే రెండు మిత్రపక్షాలు తీవ్రంగా నష్టపోక తప్పదని వారు కాస్త గట్టిగానే చెప్పినట్టు తెలుస్తోంది. కొద్దిసేపటి క్రితం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఇంట ముగ్గురు కేంద్ర మంత్రులూ సమావేశమై, ఏపీకి ఏం చేయాలన్న విషయమై సుదీర్ఘంగా చర్చించారు. హోదా, ప్యాకేజీ, పోలవరం ప్రాజెక్టుకు నిధులు, విశాఖకు రైల్వే జోన్ తదితర అంశాలన్నింటిపైనా కూలంకషంగా చర్చలు జరిపారు. అరుణ్ జైట్లీతో విడిగా సమావేశమైన సుజనా చౌదరి, హోదా ప్రకటించకుంటే ప్రజల నుంచి వచ్చే వ్యతిరేకత గురించి చెప్పారు. ఆపై వెంకయ్యనాయుడు సైతం సుజనా వ్యాఖ్యలను సమర్థించారని తెలుస్తోంది. అనంతరం సుజనా మీడియాతో మాట్లాడుతూ, ఏపీకి ఏం చేయాలన్న విషయమై ముసాయిదా తయారైందని, సీఎం చంద్రబాబు సూచనల మేరకు తాము జరిపిన సంప్రదింపులు ఫలవంతమయ్యాయని తెలిపారు. న్యాయ నిపుణులతో చర్చించిన తరువాత ప్రకటన వెలువడుతుందని వివరించారు. ఓ వైపు నుంచి సుజనా, మరో వైపు నుంచి వెంకయ్య నాయుడు విభజన హామీలపై, ముఖ్యంగా హోదా, రైల్వే జోన్ అంశాలపై ఏపీ ప్రజల్లో ఉన్న సెంటిమెంట్ గురించి ఒత్తిడి తేగా, అరుణ్ జైట్లీ మెత్తబడినట్టు తెలుస్తోంది.

More Telugu News