: స్మార్ట్ సిటీలో లేదా ఎయిర్ పోర్టుకు దగ్గరగా నివాసం ఉంటున్నారా? జేబులకు మరింత చిల్లు పెట్టే 'వీసీఎఫ్' వచ్చేస్తోంది జాగ్రత్త!

భవిష్యత్తులో స్మార్ట్ సిటీల్లో సౌకర్యాలకు వెచ్చించాల్సిన నిధులు, మౌలిక వసతుల కల్పనకు కేటాయించాల్సిన సొమ్మును అక్కడికి సమీపంలో నివసించే వారి నుంచే వసూలు చేసేలా భారత తొలి వీసీఎఫ్ (వాల్యూ కాప్చర్ ఫైనాన్సింగ్) పాలసీ ముసాయిదాకు తుది రూపు ఏర్పడింది. ఓ ఇండస్ట్రియల్ పార్క్, మరో సెజ్ లేకుంటే ఎయిర్ పోర్ట్... ఇలా ప్రభుత్వ నిధులతో శరవేగంగా అభివృద్ధి చెందే ప్రాంతాల్లో, ప్రజల ఆస్తుల విలువ సైతం అంతే వేగంగా పెరుగుతుంది. కాబట్టి ప్రజలపై కొంత మేరకు అదనపు పన్ను భారం వేయాలన్నది ఈ వీసీఎఫ్ విధానం ముఖ్య ఉద్దేశం. దీనిద్వారా ఇన్ ఫ్రాస్ట్రక్చర్ విభాగంలో పెట్టే పెట్టుబడుల్లో కొంతైనా ప్రైవేటు ల్యాండ్ ఓనర్ల నుంచి రాబట్టాలన్నది కేంద్రం అభిమతం. వీసీఎఫ్ విధానానికి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఇప్పటికే ప్రాథమిక అంగీకారం తెలిపింది. అభివృద్ధి పనులు జరుగుతున్న ప్రాంతాల్లో అడిషనల్ టాక్స్ లను వేస్తూ, వాటిని అవే ప్రాంత భవిష్యత్ అవసరాలు తీర్చేందుకు వాడాలన్న లక్ష్యంతో పట్టణాభివృద్ధి శాఖ అదనపు కార్యదర్శి సమీర్ శర్మ నేతృత్వంలోని కమిటీ వీసీఎఫ్ ను తయారు చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్ర మంత్రి వర్గ శాఖలైన పట్టణాభివృద్ధి, రైల్వేలు, రహదారి రవాణా, ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్, విద్యుత్, నౌకా శాఖల ప్రాతినిధ్యం కూడా ఉంటుంది. వీసీఎఫ్ పాలసీలో భాగంగా అర్బన్, నాన్ అర్బన్ ప్రాంతాలను వివరిస్తూ, నాన్ అర్బన్ ప్రాంతాలను ప్రోత్సహించేలా ఓ చాలెంజ్ విధానం కూడా ప్రతిపాదనలో ఉంది. ఇందులో భాగంగా, ఓ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని కేంద్రం ఎంచుకుంటే, రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని సవాలు చేసి, మరింత మెరుగైన స్థలాన్ని, మౌలిక వసతులను కల్పిస్తామని నిరూపించి, ఆ ప్రాజెక్టును చేపట్టవచ్చు. మరో రాష్ట్రం అంతకన్నా మెరుగైన వసతులు చూపిన పక్షంలో అది ఆ రాష్ట్రానికి కూడా వెళ్లిపోతుంది. తొలి దశలో జాతీయ రహదారులు, రైల్వేల విస్తరణ, పారిశ్రామిక పార్కులు, సెజ్ లు తదితర విభాగాల్లో వీసీఎఫ్ విధానాన్ని అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది.

More Telugu News